సిపార్సుల.. ‘సర్వే’శుడు
పైసలివ్వండి.. ప్రభుత్వ భూమి కలిపేసుకోండి బిల్డర్లకు జీవీఎంసీ సర్వేయర్ బంపర్ ఆఫర్ డబ్బులిస్తే చాలు.. సర్కారీ స్థలాల్లోనూ నిర్మాణాలకు అనుమతులిచ్చేస్తారు పీఎం పాలెంలో ఇదే బాపతు వ్యవహారంలో అడ్డంగా దొరికినా చర్యల్లేవ్ అతనో అధికారి.. సర్కారు భూములకు హద్దులు నిర్థారించి.. కాపాడాల్సిన బాధ్యత ఆయనది.. కానీ ఆయన చేసేదంతా... దానికి పూర్తి విరుద్ధం.. పైసలిస్తే చాలు.. ఎలాంటి అక్రమాన్నయినా సక్రమం చేసేస్తాడు.. ఇతగాడి అక్రమాలు బట్టబయలు కావడంతో తొమ్మిది నెలల క్రితం ఉన్నతాధికారులు మెమో ఇచ్చారు. తప్పయ్యిందని క్షమాపణ వేడుకున్న అతన్ని అంతటితో వదిలేశారు.. ఎటువంటి శాఖాపరమైన చర్యలూ చేపట్టలేదు.. ఇంకేముందు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఇంకా చెప్పాలంటే.. పెచ్చుమీరింది.. సదరు సర్వేయర్ లక్షల్లో వసూళ్లు చేస్తూ.. అడ్డగోలుగా ప్లాన్లు ఇచ్చేస్తున్నాడు..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘కంచే చేను మేస్తే’.. ఈ సామెత పాతదే కావొచ్చు గానీ.. మహావిశాఖ నగరపాలకసంస్థ(జీవీఎంసీ)లో సర్వేయర్‌గా పనిచేస్తున్న ఓ అధికారికి మాత్రం సరిగ్గా వర్తిస్తుంది. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన సదరు సర్వేయర్ డబ్బులిస్తే చాలు.. సర్కారీ భూములను జిరాయితీ భూములతో కలిపి బిల్డింగ్ ప్లాన్లు ఇచ్చేస్తుంటాడు. ఇప్పటికే ఇతగాడు చేసిన ఓ అక్రమ వ్యవహారాన్ని విశాఖపట్నం రూరల్ తహసీల్దార్ గుర్తించి ఆ స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు నిలిపివేయమని లేఖ రాశారు. అయినా సరే లెక్క లేని ఆ సర్వేయర్ అడ్డూఅదుపు లేకుండా ప్రభుత్వ భూములను ప్రైవేటు స్థలాలతో కలిపి భవన నిర్మాణాలకు సిఫార్సు చేస్తున్నాడు. జీవీఎంసీ పరిధిలో అపార్టుమెంట్లు, బహళ అంతస్తుల భవన నిర్మాణాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో సర్వేయర్ వసూళ్ల పర్వం పరాకాష్టకు చేరుతోంది. భవన నిర్మాణాలకు అనుమతులిచ్చేందుకు భారీగా ఇండెంట్లు పెట్టి వసూలు చేసే ఆ అధికారి ఇప్పుడు రూ.లక్షలిస్తే ప్రభుత్వ స్థలాలను కూడా కలిపేసి అనుమతులకు సిఫార్సు చేస్తున్నాడు.
చర్యలు లేకపోవడంతోనే..
పోతిన మల్లయ్యపాలెంలోని సర్వే నెంబర్ 26లో గెడ్డను కలిపి ఓ అపార్ట్‌మెంట్ నిర్మాణానికి గతంలో ఈ సర్వేయర్ సిఫార్సు చేశారు. ఈ అక్రమాన్ని పక్కా ఆధారాలతో తొమ్మిది నెలల కిందట ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. ఆ కథనంతో స్పందించిన అప్పటి జీవీఎంసీ కమిషనర్, ప్రస్తుత కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ విచారణకు ఆదేశించి సదరు సర్వేయర్‌కు మెమో కూడా జారీ చేశారు. ఆయన సిఫర్సు మేరకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రీజనల్ డిఫ్యూటీ డైరెక్టర్ విచారణ చేపట్టారు. ఆ విచారణలో సదరు సర్వేయర్ తాను పొరపాటు చేసిన మాట వాస్తవేమని అంగీకరించారు. వాగు, గెడ్డ పోరంబోకు స్థలాన్ని గమనించకుండా పొరపాటున నిర్మాణాలకు అనుమతునివ్వడం తప్పిదమేనని లిఖితపూర్వకంగా అంగీకరించారు.
అయినా సరే ఆ సర్వేయర్‌పై కనీసం శాఖాపరమైన చర్యలైనా ఉన్నతాధికారులు తీసుకోలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన సర్వేయర్ అడ్డదిడ్డంగా అనుమతులిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విజయనగరం జిల్లా కొత్తవలస నుంచి నాలుగేళ్ల కితం జీవీఎంసీకి బదలీపై వచ్చి ఇక్కడే పాతుకుపోయిన ఆ అధికారి అవినీతి పాత్రపై రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు బట్టబయలు చేసినా కార్పొరేషన్ ఉన్నతాధికారులు మిన్నకుండిపోవడం జీవీఎంసీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.