సాక్షి, సిటీబ్యూరో: ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా జీఐఎస్ సర్వేతో ప్రతిభవనాన్ని జియోట్యాగింగ్ చేస్తోన్న జీహెచ్‌ఎంసీ..గ్రేటర్‌లోని పలు భవనాలయజమానులు చెల్లించాల్సిన ఆస్తిపన్నుకంటే తక్కువగా చెల్లిస్తున్నట్లు గుర్తించింది. ప్రజలు తప్పుడు లెక్కలు చూపారో, లేక తమ సిబ్బందే ఆమ్యామ్యాలతో తక్కువ విస్తీర్ణానికి మాత్రమే ఆస్తిపన్ను లెక్కించారో, ఈ రెండూ కాక అదనపు అంతస్తులు..అదనంగా నిర్మాణాలు జరిపినవి ఆస్తిపన్ను జాబితాలో నమోదు కాలేదోకానీ మొత్తానికి పలు భవనాలు చెల్లించాల్సిన ఆస్తిపన్ను కంటే తక్కువ పన్ను మాత్రమే నిర్ధారించినట్లు గుర్తించారు. తొలిదశలో భాగంగా గ్రేటర్‌లోని మూడో వంతు భవనాలను సర్వే చేయాలని భావించారు.
ఆ క్రమంలో ఇప్పటి వరకు జియోట్యాగింగ్ చేసిన భవనాల్లో దాదాపు 18 వేల భవనాలకు సంబంధించి వ్యత్యాసాలు గుర్తించగా, దాదాపు రెండున్నర వేల భవనాల్లోతేడాలున్నట్లు గుర్తించారు. సికింద్రాబాద్, బేగంపేట, ఖైరతాబాద్, గోషామహల్, మలక్‌పేట సర్కిళ్లలో ఎక్కువ భవనాలకు తక్కువ ఆస్తిపన్ను మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. చిన్న సర్కిల్ అయిన బేగంపేటలో జియోట్యాగింగ్ జరిపినవే 835 భవనాలు కాగా, అందులో సగం కంటే ఎక్కువగా 473 భవనాల్లో వ్యత్యాసం వెల్లడైంది. శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లలో మాత్రం వ్యత్యాసాలు లేకపోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment