ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలోని దసపల్లా భూములపై తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఈనాడు దినపత్రికకు ఆ భూముల యజమాని రాణి కమలాదేవి, ఆమె కుమారుడు దిగ్విజయ్ చంద్ర బుధవారం పరువు నష్టం నోటీసులు జారీ చేశారు. రాణి కమలాదేవి తరపు న్యాయవాది అరుణ్‌దేవ్ ఈనాడు ఎడిటోరియల్ డైరెక్టర్, ఎడిటర్, ఈనాడు దినపత్రికకు నోటీసులు జారీ చేశారు. నోటీసుల సారాంశం ఇది.. విశాఖపట్నంలోని వాల్తేరు అప్ల్యాండ్స్లో ఉన్న టీఎస్ (టౌన్ సర్వే) నం 1196, 1197, 1027, 1028లో ఉన్న భూముల్ని దసపల్లా భూములంటారు.
వీటిపై మా క్లయింట్ రాణి కమలాదేవి ప్రభుత్వంతో సుదీర్ఘ పోరాటం చేశారు. ఈ భూములు రాణి కమలాదేవికి చెందినవేనని 2009లో హైకోర్టు తీర్పునిచ్చింది. ఇదే తీర్పుని సుప్రీంకోర్టు కూడా వెలువరించింది. ప్రభుత్వ భూముల పరిధి నుంచి ఈ భూముల్ని తొలగించి, సుప్రీం కోర్టు ఆదేశాల్ని పాటించాలంటూ జిల్లా కలెక్టర్కు హైకోర్టు దిశానిర్దేశం చేసింది. ఈ విషయం కూడా పత్రికల్లో ప్రచురితమైంది. అయినప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే ఈ నెల 11న ఈనాడు దినపత్రికలో ‘‘దసపల్లాపై అత్యుత్సాహం’’ పేరుతో కథనాన్ని ప్రచురించారు.
ఈ కథనంలో ‘దసపల్లా భూముల విషయంలో న్యాయ పోరాటానికి అవకాశం ఉన్నా.. ప్రభుత్వం ప్రయత్నం చేయకపోవడం, వ్యూహం ప్రకారం కలెక్టర్‌తో లేఖ రాయించి సీసీఎల్‌ఏతో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా ఉత్తర్వులు ఇప్పించడం.. ఇవన్నీ గమనిస్తే దసపల్లా భూములపై తెరవెనుక ఎంత పెద్ద మంత్రాంగం జరిగిందో అర్థమవుతోంది’ అంటూ మా క్లయింట్ పరువుకు భంగం కలిగించేలా అసత్యపు ఆరోపణలతో కథనాన్ని ప్రచురించారు.
దసపల్లా భూముల వ్యవహారంలో రాణి కమలాదేవి కుటుంబం ప్రతిష్టని దిగజార్చేలా అసత్యాల్ని ప్రచురిస్తున్నారు. ఈ కథనాన్ని ఖండిస్తూ ఈనాడు పత్రికలో సవరణ ప్రచురించాలి’ అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వెంటనే సవరణ వార్తని ప్రచురించకపోతే రూ.కోటికి పరువు నష్టం దావా వేస్తామని న్యాయవాది అరుణ్‌దేవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment