Daspalla Hotel
-
‘దసపల్లా’ కథనాలపై పరువునష్టం దావా
దసపల్లా భూములపై రాసిందే పదేపదే రాస్తున్నారు రామోజీరావు. పేదలు ఏళ్ల తరబడి అడుగుతున్నా పట్టించుకోని అధికారులు... దసపల్లా భూముల్ని మాత్రం 22(ఎ) జాబితా నుంచి తొలగించడానికి అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ బుధవారం మరో బ్యానర్ కథనాన్ని వండేశారు. ఇదే కథనాన్ని అటుతిప్పి.. ఇటు తిప్పి గతంలోనే పలుమార్లు రాయగా... వాస్తవాలు వివరిస్తూ స్థానిక ప్లాట్ల యజమానులు, భూ యజమాని రాణి కమలాదేవి, ప్లాట్ల యజమానులతో డెవలప్మెంట్ ఒప్పందం చేసుకున్న కంపెనీ... అందరూ ఖండించారు. దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ ఈ భూములు ప్రభుత్వానివి కావని, రాణి కమలాదేవికే చెందుతాయని పదేపదే తీర్పులిచ్చాక కూడా ప్రభుత్వం వీటిని వ్యూహాత్మకంగా వారికి అప్పగించేస్తోందని ‘ఈనాడు’ రాస్తోందంటే దాని అర్థమేంటి? కోర్టు తీర్పులను అమలు చేయకూడదనా? కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోవాలనా? ఎందుకు రామోజీరావు గారూ ఈ రాతలు? రాసిందే పదేపదే రాయటం వెనక అర్థమేంటి? బుధవారం రాసిన కథనానికి సంబంధించి ‘ఈనాడు’పై పరువునష్టం దావా వేస్తామంటూ రాణి కమలాదేవి, ఆమె కుమారుడు నోటీసులివ్వగా... విశాఖపట్నం జిల్లా కలెక్టరు కూడా పరువునష్టం దావా వేస్తున్నట్లు తెలియజేశారు. చట్టపరమైన చర్యలు... ‘‘దసపల్లా భూములపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ భూములకు సంబంధించి న్యాయస్థానాలు జారీ చేసిన ఆదేశాలు ఈ నెల 23 నాటికి అమలు చేయాలని కోర్టులు స్పష్టంచేశాయి. లేకుంటే హైకోర్టుకు జిల్లా కలెక్టర్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. అందుకే కోర్టు తీర్పులను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం’’ అని పేర్కొనటంతో పాటు... ఆ భూముల చరిత్రను కూడా వివరించారు కలెక్టర్. ఇదీ... దసపల్లా భూముల కథ ► మొదటి నుంచీ రాణి కమలాదేవి కుటుంబీకుల చేతుల్లోనే ఉన్న ఈ భూములపై... సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్‌తో పలు వ్యాజ్యాలు నడిచినా... చివరకు డైరెక్టరు కూడా ఆ భూములు వారివేనని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చారు. 1985లో ఈ భూములపై తహశీల్దార్ హైకోర్టులో కేసు వేయగా... వాదోపవాదాలు విన్న న్యాయస్థానం 1992లో ఆ భూములు కమలా దేవికి చెందినవి అంటూ తీర్పునిచ్చింది. ► ఇంతలో జీవో నం. 657 విడుదల చేసి... ఆ భూముల్ని ప్రభుత్వ పోరంబోకు భూమలుగా గుర్తిస్తూ సెక్షన్ 22(ఏ)లో నమోదు చేశారు. దీనిపై 2005లో హైకోర్టులో రాణి కమలాదేవి రిట్ పిటిషన్ వేశారు. దీంతో జీవో ఈ భూములకు వర్తించదని కోర్టు తీర్పునిచ్చింది. ► నాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా ప్రభుత్వ పిటిషన్లని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో 2012లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. దాన్నీ కోర్టు డిస్మిస్ చేసింది. 2014లో రాష్ట్ర ప్రభుత్వం చివరి ప్రయత్నంగా క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. దాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ► తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం పదే పదే సుప్రీంకి వెళ్తుండటంతో రాణి కమలాదేవి 2012లో హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు వేశారు. ఇది పెండింగ్‌లో ఉండగానే... ఆ భూముల్ని 22(ఏ)లో పెట్టి నోటిఫై చేసింది ప్రభుత్వం. దీనిపై రాణి కమలాదేవి మళ్లీ కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు జిల్లా గెజిట్‌ను రద్దుచేసి... ప్రభుత్వానికి తగు సూచనలు చేయాలని అడ్వకేట్ జనరల్‌కు చెప్పింది. ఏజీ ప్రభుత్వానికి అదే సూచన చేశారు. అయినా అమలు చేయకపోవడంతో మరోసారి పిటిషనర్లు్ల కోర్టుకు వెళ్లారు. దీంతో.. దసపల్లా భూములకు సంబంధించి ఈ నెల 23 నాటికి కోర్టు ఆదేశాలు అమలు చేయాలని... లేకుంటే కలెక్టర్ హైకోర్టుకు వ్యక్తిగతంగా రావాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. ► అన్ని దారులు మూసుకుపోవడంతో పాటు కోర్టు ధిక్కార పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున, సుప్రీం ఆదేశాలను, ఏజీ సూచనను అంగీకరిస్తూ.. న్యాయస్థానాల ఆదేశాల్ని 2022 డిసెంబర్ 31న అమలు చేసినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వాస్తులు, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, రెవెన్యూ విభాగాలవిగా చెబుతున్న 18.41 ఎకరాల్ని మాత్రం 22(ఏ)లో అలాగే ఉంచినట్లు తెలిపారు. ఎవరైనా ఇంకేం చేస్తారు? ఇవీ వాస్తవాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందే కదా? అన్ని స్థాయిల్లోనూ న్యాయ పోరాటం చేసి ఓడిపోయాక... కోర్టు ధిక్కార కేసులను సైతం ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయస్థానాలు హెచ్చరించాక ఏ ప్రభుత్వమైనా ఆ ఆదేశాలను అమలు చేయక ఇంకేం చేస్తుంది? కథనాలు రాసేముందు ఈ మాత్రం ఆలోచించకపోతే ఎలా రామోజీరావు గారూ? ఈ రాతలు... మరీ ఘోరం ‘‘విశాఖలో 2002లో ఓ అపార్ట్మెంట్ కట్టారు. అందులో పిసరంత ప్రభుత్వ భూమి ఉందని మొత్తం అపార్ట్‌మెంట్‌నే 22(ఏ)లో పెట్టేశారు. ఈ సంగతి అపార్ట్మెంట్లోని ఫ్లాట్ల ఓనర్లకు ఏడెనిమిదేళ్ల కిందట తెలిసింది. అప్పటి నుంచి తిరుగుతున్నా ఇప్పటికీ 22(ఏ) నుంచి తొలగించలేదు. ఇదీ ఈ ప్రభుత్వం సామాన్యుల విషయంలో అనుసరిస్తున్న వైఖరి’’అంటూ తన కథనంలో ‘ఈనాడు’ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. మరి ఎనిమిదేళ్ల కిందట అంటే అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబునాయుడు కదా? ఐదేళ్ల పాటు ఆయనే ఉన్నారు కదా? ఐదేళ్లూ వారు 22(ఏ) నుంచి తొలగించలేదంటే ఏమని అనుకోవాలి? మరి అప్పుడెందుకు ప్రశ్నించలేదు? ఐదేళ్లూ బాబు ప్రభుత్వంలో చేయని పనిని... ఈ ప్రభుత్వం మూడేళ్లలో చేయలేదని విమర్శించటం సబబేనా? ఎందుకీ దుర్మార్గపు రాతలు రామోజీరావు గారూ? బాబు అధికారంలో ఉంటే ప్రశ్నించాల్సిన మీ కలంలో సిరా అయిపోతుందా? లేక మీ గొంతు మూగబోతుందా? -
తప్పుడు కథనంపై ‘ఈనాడు’కు నోటీసులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలోని దసపల్లా భూములపై తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఈనాడు దినపత్రికకు ఆ భూముల యజమాని రాణి కమలాదేవి, ఆమె కుమారుడు దిగ్విజయ్ చంద్ర బుధవారం పరువు నష్టం నోటీసులు జారీ చేశారు. రాణి కమలాదేవి తరపు న్యాయవాది అరుణ్‌దేవ్ ఈనాడు ఎడిటోరియల్ డైరెక్టర్, ఎడిటర్, ఈనాడు దినపత్రికకు నోటీసులు జారీ చేశారు. నోటీసుల సారాంశం ఇది.. విశాఖపట్నంలోని వాల్తేరు అప్ల్యాండ్స్లో ఉన్న టీఎస్ (టౌన్ సర్వే) నం 1196, 1197, 1027, 1028లో ఉన్న భూముల్ని దసపల్లా భూములంటారు. వీటిపై మా క్లయింట్ రాణి కమలాదేవి ప్రభుత్వంతో సుదీర్ఘ పోరాటం చేశారు. ఈ భూములు రాణి కమలాదేవికి చెందినవేనని 2009లో హైకోర్టు తీర్పునిచ్చింది. ఇదే తీర్పుని సుప్రీంకోర్టు కూడా వెలువరించింది. ప్రభుత్వ భూముల పరిధి నుంచి ఈ భూముల్ని తొలగించి, సుప్రీం కోర్టు ఆదేశాల్ని పాటించాలంటూ జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు దిశానిర్దేశం చేసింది. ఈ విషయం కూడా పత్రికల్లో ప్రచురితమైంది. అయినప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే ఈ నెల 11న ఈనాడు దినపత్రికలో ‘‘దసపల్లాపై అత్యుత్సాహం’’ పేరుతో కథనాన్ని ప్రచురించారు. ఈ కథనంలో ‘దసపల్లా భూముల విషయంలో న్యాయ పోరాటానికి అవకాశం ఉన్నా.. ప్రభుత్వం ప్రయత్నం చేయకపోవడం, వ్యూహం ప్రకారం కలెక్టర్‌తో లేఖ రాయించి సీసీఎల్ఏతో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా ఉత్తర్వులు ఇప్పించడం.. ఇవన్నీ గమనిస్తే దసపల్లా భూములపై తెరవెనుక ఎంత పెద్ద మంత్రాంగం జరిగిందో అర్థమవుతోంది’ అంటూ మా క్లయింట్ పరువుకు భంగం కలిగించేలా అసత్యపు ఆరోపణలతో కథనాన్ని ప్రచురించారు. దసపల్లా భూముల వ్యవహారంలో రాణి కమలాదేవి కుటుంబం ప్రతిష్టని దిగజార్చేలా అసత్యాల్ని ప్రచురిస్తున్నారు. ఈ కథనాన్ని ఖండిస్తూ ఈనాడు పత్రికలో సవరణ ప్రచురించాలి’ అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వెంటనే సవరణ వార్తని ప్రచురించకపోతే రూ.కోటికి పరువు నష్టం దావా వేస్తామని న్యాయవాది అరుణ్‌దేవ్ తెలిపారు. -
వయ్యారి భామా నీ హంస నడక...
-
పెళ్లి వేడుకకు హాజరైన సీఎం వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్యామూల్ కుమారుడి పెళ్లికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. మదాపూర్‌లోని దస్పల్లా హోటల్లో జరిగిన ఈ వివాహా వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లికి హాజరైన ముఖ్యమంత్రితో సెల్పీలు దిగేందుకు అక్కడికి వచ్చిన అతిథులు పోటీపడ్డారు. శ్యాముల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సలహాదారుడుగా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలు కార్యక్రమం అమలు, పర్యవేక్షణ కమిటీకి శామ్యూల్ వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. -
మేనకోడలు పాత్రపై అనుమానాలు!
సాక్షి, అమరావతి బ్యూరో/హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారి పక్కన కారులో జయరాం మృతదేహాన్ని గురువారం అర్ధరాత్రి పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. వాహనంలో ఆయన మృతదేహం పడి ఉన్న తీరును బట్టి హత్యగా భావిస్తున్న పోలీసులు.. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వివాదాలతో పాటు వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. జయరామ్ హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై అనుమానాలు రేకెత్తడంతో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఆమెను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను కంచికచెర్ల సర్కిల్ స్టేషన్లో ఉంచి జిల్లా ఎస్పీ త్రిపాఠి స్వయంగా విచారించారు. దాదాపు 20 గంటలపాటు విచారించినప్పటికీ అమె పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఆమెతో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని జయరామ్, శిఖా చౌదరి నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. జయరామ్ ఎక్కడెక్కడికి వెళ్లారు? జయరామ్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతను ఎక్కడెక్కడికి వెళ్లాడు అనే కోణంలో కృష్ణా జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నారు. దాన్నిబట్టి మొదట దస్పల్లా హోటల్ వద్దకు వెళ్లి అక్కడి సీసీ టీవీ పుటేజీలను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. జయరామ్‌తో పాటు ఎవరైనా కొత్తవ్యక్తులు ఉన్నారా అనే కోణంలో హోటల్ సిబ్బందిని విచారించారు. హోటల్ వద్ద జయరామ్‌కు ఓ వ్యక్తి రూ. ఆరు లక్షలు ఇచ్చాడని, హోటల్ గది అప్పటికే ఓ యువతి పేరుమీద ఉన్నట్లు సమాచారం. హోటల్ నిర్వాహకులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. శిఖా చౌదరి పాత్రపై అనుమానాలు.. శిఖా చౌదరి.. జయరామ్‌కు మేనకోడలు, వ్యాపార భాగస్వామి. జయరామ్ ప్రారంభించిన ఏ వ్యాపారంలోనైనా ఈమె డైరెక్టర్‌గా వ్యవహరించారు. అతను నిర్వహించిన ఓ న్యూస్ చానల్లోనూ శిఖా చౌదరి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన భార్యా పిల్లల కంటే ఈమెకే జయరామ్ ప్రాముఖ్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల శిఖా సోదరి మనీషా చదువు కోసం రూ. కోటి వరకు జయరామ్ చెల్లించినట్లు సమాచారం. జయరామ్ ఎప్పుడు అమెరికా నుంచి వచ్చినా శిఖా ఇంటికి రాత్రిపూట వచ్చి వెళ్లేవాడని ఆమె నివసిస్తున్న అపార్ట్మెంట్ వాచ్మెన్ చెబుతున్నాడు. గత నెల 29న రాత్రి కూడా ఆమె ఇంటికి జయరాం వచ్చి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జయరామ్ హత్యకు గురైన రోజున రాత్రి 11 గంటలకు ఇంటి నుంచి శిఖా చౌదరి ఒంటరిగా కారు తీసుకుని హడావుడిగా వెళ్లినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్‌లోనే హత్యకు స్కెచ్! హత్య కేసులో నందిగామ పోలీసులకు పలు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా హైదరాబాద్ కేంద్రంగా జయరామ్ హత్యకు కుట్ర జరిగినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై జయరామ్ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, కోస్టల్ బ్యాంక్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మేనకోడలు పాత్రపై ఆరా తీశారు. దస్పల్లా హోటల్లో జయరామ్ పేరిట 10 రోజులుగా ఓ రూమ్ బుక్ చేయడం, అదే హోటల్లో గురువారం ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశం జరగడం, అక్కడి నుంచే జయరామ్ ఓ తెల్లచొక్కా ధరించిన వ్యక్తితో కలిసి కారులో వెళ్లినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. పతంగి టోల్గేట్ వద్ద నమోదైన సీసీ టీవీ ఫుటేజీలోనూ జయరామ్‌తోపాటు మరో ఇద్దరు ప్రయాణించినట్లు తేలింది. తెల్లచొక్కా ధరించిన వ్యక్తి కారు నడిపినట్లు గుర్తించారు. కారులో లభ్యమైన మద్యం బాటిళ్లు తదితరాలను బట్టి ఈ హత్యకు హైదరాబాద్‌లోనే కుట్ర పన్నినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాకేష్ ఎవరనే కోణంలో ఆరా.. జయరామ్ చెల్లులు సుశీలతోపాటు మేనకోడళ్లు శిఖా చౌదరి, మనీషాలతోపాటు డ్రైవర్ సతీష్‌తోపాటు గన్మెన్లను పోలీసులు విచారిస్తున్నారు. అదే సందర్భంలో మేనకోడలు శిఖా చౌదరి ప్రియుడుగా భావిస్తున్న రాకేష్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. శిఖా చౌదరికి రాకేష్ రూ. 4.5 కోట్లు అప్పు ఇచ్చినట్లు సమాచారం. ఈ డబ్బుల విషయంలో రెండేళ్లుగా రాకేష్–శిఖా మధ్య గొడవలు జరుగుతున్నాయని, తన మేనకోడలి అప్పును తీరుస్తానని జయరామ్ హామీ ఇచ్చారని, అయితే ఆ తర్వాత డబ్బు సర్దుబాబు చేయకపోవడంతోనే వీరి ముగ్గురి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఆ వివాదమే హత్యకు దారితీసిందా? అన్న కోణంలో రాకేష్‌ను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. శ్రీకాంత్ అనే మరో యువకుడిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ఎంపీ తమ్ముడి కొడుకుతోనూ శిఖాకు పరిచయాలున్నాయని, బీర్ కంపెనీ పెడతానని అతని ద్వారా భారీగా పెట్టుబడి పెట్టించినట్లు విచారణలో తేలింది. ఆ సమయంలో ఏం జరిగింది? జయరాం స్వస్థలం విజయవాడ కాగా గత నెల 30న హైదరాబాద్ నుంచి బయల్దేరారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద గత నెల 31వ తేది రాత్రి 2గంటలకు ఆయన కారు సీసీ పుటేజీలో కనిపించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవడానికి 5 గంటల సమయం పడుతుంది. ఈ మిగతా సమయం ఎక్కడున్నాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కీలకం కానున్న ఫోరెన్సిక్ నివేదిక అనుమానస్పద స్థితిలో మృతి చెందిన జయరామ్ మృతదేహంపై పలు భాగాల్లో గట్టిగా దెబ్బలు తగిలిన దాఖలాలేమి కనిపించలేదు. మోచేయి కింద భాగంలో, పొట్ట ఎడమ వైపున, కుడివైపు ఛాతీ పైభాగంలోనూ కందిన గాయాలున్నాయి. ముక్కు, నోటి నుంచి రక్తం ధారగా కారింది. చేతులు నల్లగా ఉండడం, శరీరంలో నీలిరంగులోకి మారడంతో ఆయనపై ఏదైనా విషప్రయోగం చేశారా? కొట్టి హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం సందర్భంగా శరీర భాగాలను వైద్యులు సేకరించి విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడి నుంచి నివేదిక అందాకే హత్య మిస్టరీ వీడే అవకాశం ఉందని పోలీసు భావిస్తున్నారు కేన్సర్ ఆస్పత్రిలో మృతదేహం జయరామ్ మృతదేహాన్ని శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 44లోని ఇంట్లో గత కొద్దిరోజులుగా జయరామ్ ఒక్కరే ఉంటున్నట్లు తెలుస్తోంది. అతడి భార్యా, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. ఇదిలాఉండగా జయరామ్ భార్య పద్మశ్రీ, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ప్లోరిడాలో మంచు తుఫాను వల్ల హైదరాబాద్ రావడానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నట్లు తెలుస్తున్నది. ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని భావించినా సాధ్యమయ్యేట్లు కనిపించడం లేదు. గది తాళాలు ఇవ్వాలని దౌర్జన్యం చేసింది: వాచ్మెన్ వెంకటేశ్ జయరామ్ మృతిచెందిన మరుసటిరోజు శిఖా చౌదరి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 44లోని జయరామ్ ఇంటికి వచ్చి రూం తాళాలు ఇవ్వాలని దౌర్జన్యం చేసినట్లు జయరామ్ ఇంటి వాచ్మెన్ వెంకటేశ్ తెలిపాడు. తాను తాళాలు ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. అదే సమయంలో ఆమెకు ఫోన్ రావడంతో వెళ్లిపోయినట్లు తెలిపాడు. ఆ రోజు రాత్రి డ్యూటీకి రాగానే జయరామ్ సార్‌కు ఫోన్ చేశానని, మీటింగ్‌లో ఉన్నాను తర్వాత ఫోన్ చేస్తానని చెప్పాడన్నాడు. ఆ తర్వాత గన్‌మెన్ ద్వారా జయరామ్ మృతి విషయం తెలిసిందని, ఎవరు హత్య చేశారో అంతు చిక్కడంలేదన్నారు. రెండేళ్ల కిందట జయరామ్ తల్లి చనిపోయిన సమయంలో శిఖా చౌదరికి, జయరామ్ కుటుంబ సభ్యుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయని చెప్పాడు. తాను గత 20 ఏళ్లుగా జయరామ్ కంపెనీలో ఎలక్ట్రీషన్‌గా, వ్యక్తిగత సహాయకుడిగా, ఇంటి కాపలాదారుగా పనిచేస్తున్నట్లు తెలిపాడు. జయరామ్ వైన్ తప్ప మద్యం తాగడని ఆయన స్పష్టం చేశాడు. ఎవరిని అదుపులోకి తీసుకోలేదు : సర్వశ్రేష్ఠ త్రిపాటి, ఎస్పీ కంచికచెర్ల సర్కిల్ పోలీసు స్టేషన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు జయరామ్ హత్య కేసుకు సంబంధించి ఆయన కోడళ్లు, డ్రైవర్, గన్మెన్లతోపాటు మరో ముగ్గురు అనుమానితులను ఎస్పీ త్రిపాఠి విచారించారు. ఈ సందర్బంగా ఆయన సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. ‘జయరామ్ హత్య కేసులో తాము ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. కేవలం అనుమానితులను మాత్రమే విచారణ చేస్తున్నాం. త్వరలోనే కేసుని ఛేదిస్తాం’ అని తెలిపారు. -
పోలీసుల అదుపులో వర్థమాన నటుడు
హైదరాబాద్ : వర్థమాన నటుడు, 'ఫేస్బుక్' చిత్రం హీరో నండూరి ఉదయ్ కిరణ్ అలియాస్ బాబీ గత రాత్రి దసపల్లా హోటల్లో హల్ చల్ చేశాడు. మద్యం సేవించిన అతడు అక్కడ సిబ్బందిపై దాడి చేసి, హోటల్ అద్దాలు ధ్వంసం చేశాడు. అంతేకాకుండా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. హోటల్ యాజమాన్యం ఫిర్యాదుతో ఉదయ్‌కిరణ్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా గతంలో ఉదయ్ కిరణ్ డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కడం అప్పట్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. కాగా తనపై వచ్చిన ఆరోపణలను ఉదయ్ కిరణ్ కొట్టిపారేశాడు. తాను ఎవరిపైనా దాడి చేయలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తెలిపాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మలుపుతిరుగుతున్న'పోలీసు అబ్బాయి' కారు కేసు
హైదరాబాద్‌లో చోరీకి గురైన కారు కేసు మలుపులు తిరుగుతోంది. కేసులో ప్రధాన నిందితుడు జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి కుమారుడు కావడంతో అందరి దృష్టి ఒక్కసారిగా జిల్లాపై పడింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన ఎన్వీవీ ప్రసాద్ స్కోడా కంపెనీకి చెందిన సూపర్బ్ కారును గతేడాది మే 22న దస్పల్లా హోటల్ వద్ద పార్క్ చేసిన గంటలోపే మాయమైంది. పలు ప్రాంతాల్లో వెతికిన బాధితుడు మరునాడు జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినా సరైన ఆధారాలు లభ్యం కాకపోపోవడంతో కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఈ కేసును విచారిస్తున్న క్రమంలో హోటల్ సీసీ కెమెరాలను పరిశీలించి పలువురు అనుమానితులను విచారించారు. దీనిలో జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న ఓ పోలీస్ అధికారి కుమారుడు ‘ఆర్ ’ అక్షరంతో పేరుగల వ్యక్తితోపాటు అతడి ముగ్గురు మిత్రులు ఉన్నారు. మొదట ఎలాంటి ఆధారాలు లభ్యంకాకపోవడంతో అప్పుడు వదిలివేశారు. అయితే కేసును విచారిస్తున్న క్రమంలో కిరణ్ అనే వ్యక్తి అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. అతడిని విచారించిన సమయంలో ఈ విలువైన కారు విషయం బయటకు వచ్చింది. దీంతో మళ్లీ సీసీ కెమెరాలతోపాటు బయట ఉన్న మరిన్ని పుటేజీలు పరిశీలించిన సమయంలో జిల్లాకు చెందిన పోలీస్ అధికారి కుమారుడే ఈ కారును చోరీచేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యంకాగా.. వారిని మళ్లీ పిలిపించి వారి పద్ధతిలోనే విచారించారు. దీంతో కారు చోరీ చేయడంతోపాటు అమ్మగా వచ్చిన డబ్బులు జల్సాలు చేసినట్లు ఒప్పుకున్నారని సమాచారం. ప్రస్తుతం నలుగురిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. ప్రస్తుతం ఆ కారు జిల్లాలోనే ఉందని తెలియడంతో కరీంనగర్లో దాని ఆచూకీ కోసం వేట ప్రారంభించారు. ఈ సమయంలోనే జిల్లాలోని పోలీస్ అధికారి కుమారుడి హస్తం ఉన్నట్లు బయటకు పొక్కింది. గతంలో జిల్లాలో పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఓ అధికారి కృషితోనే సదరు అధికారి కుమారుడు చిక్కినట్లు ప్రచారం జరుగుతోంది. కారు రికవరీ కాగానే నేడోరేపో వారిని అరెస్టు చూపే అవకాశాలున్నాయని తెలిసింది.