దసపల్లా భూములపై రాసిందే పదేపదే రాస్తున్నారు రామోజీరావు. పేదలు ఏళ్ల తరబడి అడుగుతున్నా పట్టించుకోని అధికారులు... దసపల్లా భూముల్ని మాత్రం 22(ఎ) జాబితా నుంచి తొలగించడానికి అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ బుధవారం మరో బ్యానర్ కథనాన్ని వండేశారు. ఇదే కథనాన్ని అటుతిప్పి.. ఇటు తిప్పి గతంలోనే పలుమార్లు రాయగా... వాస్తవాలు వివరిస్తూ స్థానిక ప్లాట్ల యజమానులు, భూ యజమాని రాణి కమలాదేవి, ప్లాట్ల యజమానులతో డెవలప్‌మెంట్ ఒప్పందం చేసుకున్న కంపెనీ... అందరూ ఖండించారు.
దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ ఈ భూములు ప్రభుత్వానివి కావని, రాణి కమలాదేవికే చెందుతాయని పదేపదే తీర్పులిచ్చాక కూడా ప్రభుత్వం వీటిని వ్యూహాత్మకంగా వారికి అప్పగించేస్తోందని ‘ఈనాడు’ రాస్తోందంటే దాని అర్థమేంటి? కోర్టు తీర్పులను అమలు చేయకూడదనా? కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోవాలనా? ఎందుకు రామోజీరావు గారూ ఈ రాతలు? రాసిందే పదేపదే రాయటం వెనక అర్థమేంటి? బుధవారం రాసిన కథనానికి సంబంధించి ‘ఈనాడు’పై పరువునష్టం దావా వేస్తామంటూ రాణి కమలాదేవి, ఆమె కుమారుడు నోటీసులివ్వగా... విశాఖపట్నం జిల్లా కలెక్టరు కూడా పరువునష్టం దావా వేస్తున్నట్లు తెలియజేశారు.
చట్టపరమైన చర్యలు...
‘‘దసపల్లా భూములపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ భూములకు సంబంధించి న్యాయస్థానాలు జారీ చేసిన ఆదేశాలు ఈ నెల 23 నాటికి అమలు చేయాలని కోర్టులు స్పష్టంచేశాయి. లేకుంటే హైకోర్టుకు జిల్లా కలెక్టర్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. అందుకే కోర్టు తీర్పులను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం’’ అని పేర్కొనటంతో పాటు... ఆ భూముల చరిత్రను కూడా వివరించారు కలెక్టర్.
ఇదీ... దసపల్లా భూముల కథ
► మొదటి నుంచీ రాణి కమలాదేవి కుటుంబీకుల చేతుల్లోనే ఉన్న ఈ భూములపై... సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్‌తో పలు వ్యాజ్యాలు నడిచినా... చివరకు డైరెక్టరు కూడా ఆ భూములు వారివేనని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చారు. 1985లో ఈ భూములపై తహశీల్దార్ హైకోర్టులో కేసు వేయగా... వాదోపవాదాలు విన్న న్యాయస్థానం 1992లో ఆ భూములు కమలా దేవికి చెందినవి అంటూ తీర్పునిచ్చింది.
► ఇంతలో జీవో నం. 657 విడుదల చేసి... ఆ భూముల్ని ప్రభుత్వ పోరంబోకు భూమలుగా గుర్తిస్తూ సెక్షన్ 22(ఏ)లో నమోదు చేశారు. దీనిపై 2005లో హైకోర్టులో రాణి కమలాదేవి రిట్ పిటిషన్ వేశారు. దీంతో జీవో ఈ భూములకు వర్తించదని కోర్టు తీర్పునిచ్చింది.
► నాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా ప్రభుత్వ పిటిషన్లని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
దీంతో 2012లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. దాన్నీ కోర్టు డిస్మిస్ చేసింది. 2014లో రాష్ట్ర ప్రభుత్వం చివరి ప్రయత్నంగా క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. దాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.
► తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం పదే పదే సుప్రీంకి వెళ్తుండటంతో రాణి కమలాదేవి 2012లో హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు వేశారు. ఇది పెండింగ్‌లో ఉండగానే... ఆ భూముల్ని 22(ఏ)లో పెట్టి నోటిఫై చేసింది ప్రభుత్వం. దీనిపై రాణి కమలాదేవి మళ్లీ కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు జిల్లా గెజిట్‌ను రద్దుచేసి... ప్రభుత్వానికి తగు సూచనలు చేయాలని అడ్వకేట్ జనరల్‌కు చెప్పింది. ఏజీ ప్రభుత్వానికి అదే సూచన చేశారు. అయినా అమలు చేయకపోవడంతో మరోసారి పిటిషనర్లు్ల కోర్టుకు వెళ్లారు. దీంతో.. దసపల్లా భూములకు సంబంధించి ఈ నెల 23 నాటికి కోర్టు ఆదేశాలు అమలు చేయాలని... లేకుంటే కలెక్టర్ హైకోర్టుకు వ్యక్తిగతంగా రావాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది.
► అన్ని దారులు మూసుకుపోవడంతో పాటు కోర్టు ధిక్కార పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున, సుప్రీం ఆదేశాలను, ఏజీ సూచనను అంగీకరిస్తూ.. న్యాయస్థానాల ఆదేశాల్ని 2022 డిసెంబర్ 31న అమలు చేసినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వాస్తులు, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, రెవెన్యూ విభాగాలవిగా చెబుతున్న 18.41
ఎకరాల్ని మాత్రం 22(ఏ)లో అలాగే ఉంచినట్లు తెలిపారు.
ఎవరైనా ఇంకేం చేస్తారు?
ఇవీ వాస్తవాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందే కదా? అన్ని స్థాయిల్లోనూ న్యాయ పోరాటం చేసి ఓడిపోయాక... కోర్టు ధిక్కార కేసులను సైతం ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయస్థానాలు హెచ్చరించాక ఏ ప్రభుత్వమైనా ఆ ఆదేశాలను అమలు చేయక ఇంకేం చేస్తుంది? కథనాలు రాసేముందు ఈ మాత్రం ఆలోచించకపోతే ఎలా రామోజీరావు గారూ?
ఈ రాతలు... మరీ ఘోరం
‘‘విశాఖలో 2002లో ఓ అపార్ట్‌మెంట్ కట్టారు. అందులో పిసరంత ప్రభుత్వ భూమి ఉందని మొత్తం అపార్ట్‌మెంట్‌నే 22(ఏ)లో పెట్టేశారు. ఈ సంగతి అపార్ట్‌మెంట్లోని ఫ్లాట్ల ఓనర్లకు ఏడెనిమిదేళ్ల కిందట తెలిసింది. అప్పటి నుంచి తిరుగుతున్నా ఇప్పటికీ 22(ఏ) నుంచి తొలగించలేదు. ఇదీ ఈ ప్రభుత్వం సామాన్యుల విషయంలో అనుసరిస్తున్న వైఖరి’’అంటూ తన కథనంలో ‘ఈనాడు’ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది.
మరి ఎనిమిదేళ్ల కిందట అంటే అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబునాయుడు కదా? ఐదేళ్ల పాటు ఆయనే ఉన్నారు కదా? ఐదేళ్లూ వారు 22(ఏ) నుంచి తొలగించలేదంటే ఏమని అనుకోవాలి? మరి అప్పుడెందుకు ప్రశ్నించలేదు? ఐదేళ్లూ బాబు ప్రభుత్వంలో చేయని పనిని... ఈ ప్రభుత్వం మూడేళ్లలో చేయలేదని విమర్శించటం సబబేనా? ఎందుకీ దుర్మార్గపు రాతలు రామోజీరావు గారూ? బాబు అధికారంలో ఉంటే ప్రశ్నించాల్సిన మీ కలంలో సిరా అయిపోతుందా? లేక మీ గొంతు మూగబోతుందా?
Comments
Please login to add a commentAdd a comment