Kamaladevi
-
విద్యార్థిని హత్య కేసులో 143 రోజుల్లోనే తీర్పు
కాకినాడ లీగల్: ఓ విద్యార్థిని పాశవికంగా హత్య చేసిన కేసులో ప్రేమోన్మాదికి కేవలం 143 రోజుల్లోనే శిక్ష పడింది. నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ కాకినాడ మూడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పి.కమలాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. రాష్ట్రంలో కేసులు త్వరితగతిన విచారణ జరిగి, నిందితులకు శిక్ష పడాలని, బాధితులకు సత్వర న్యాయం జరగాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ ఇందుకు దోహదం చేసింది. గత ఏడాది జరిగిన హత్య కేసు విచారణ వేగంగా జరిగి, నిందితుడికి కఠిన శిక్ష పడింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బాలవరానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ కూరాడలో మేనమామ ఇంట్లో ఉండేవాడు. అదే గ్రామంలో కె.దేవిక తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ కాకినాడ పీఆర్ కళాశాలలో డిగ్రీ చదువుకునేది. దేవికను ప్రేమించానంటూ సూర్యనారాయణ వెంటపడేవాడు. సుమారు ఏడాది పాటు వెంట పడి వేధించాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. ఇతని వేధింపులు భరించలేక దేవిక విషయాన్ని బంధువులకు చెప్పింది. పెద్దలు యువకుడ్ని మందలించి పంపించేశారు. అయినా అతడు తన చేష్టలు ఆపలేదు. గతేడాది అక్టోబర్ 8న కాండ్రేగుల – కూరాడ మధ్య కాపు కాశాడు. యాక్టివా మోపెడ్‌పై వస్తున్న దేవికను ఆపి నడిరోడ్డుపై కత్తితో 18 సార్లు కిరాతకంగా పొడిచాడు. ఆమె అక్కడకక్కడే చనిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరిగింది. కాకినాడ రూరల్ సీఐ కె.శ్రీనివాసు త్వరితగతిన కేసు దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలు సేకరించి 7 రోజులలోనే కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ త్వరితగతిన జరిగింది. నేరం రుజువు కావడంతో సూర్యనారాయణకు జీవిత ఖైదు విధిస్తూ జడ్జి పి.కమలాదేవి తీర్పు చెప్పారు. కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థతో సత్ఫలితాలు విద్యార్థిని పాశవిక హత్య ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. వెంటనే మృతురాలి కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. త్వరితగతిన విచారణ జరపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎస్పీ ఎం.రవీంధ్రనాథ్‌బాబు నిరంతరం దర్యాప్తును పర్యవేక్షించారు. ఇందుకు కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ చక్కగా పనిచేసింది. కేసు నమోదు చేసిన 143 రోజుల్లో విచారణ చేసి నిందితుడికి శిక్ష పడేలా చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ తీర్పు చెంపపెట్టు అవుతుందని పోలీసు అధికారులు వ్యాఖ్యానించారు. కేసు విచారణ విషయంలో ప్రభుత్వం బాగా స్పందించిందని, నిందితుడికి కఠిన శిక్ష పడిందని మృతురాలి తల్లి నాగమణి అన్నారు. -
‘దసపల్లా’ కథనాలపై పరువునష్టం దావా
దసపల్లా భూములపై రాసిందే పదేపదే రాస్తున్నారు రామోజీరావు. పేదలు ఏళ్ల తరబడి అడుగుతున్నా పట్టించుకోని అధికారులు... దసపల్లా భూముల్ని మాత్రం 22(ఎ) జాబితా నుంచి తొలగించడానికి అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ బుధవారం మరో బ్యానర్ కథనాన్ని వండేశారు. ఇదే కథనాన్ని అటుతిప్పి.. ఇటు తిప్పి గతంలోనే పలుమార్లు రాయగా... వాస్తవాలు వివరిస్తూ స్థానిక ప్లాట్ల యజమానులు, భూ యజమాని రాణి కమలాదేవి, ప్లాట్ల యజమానులతో డెవలప్మెంట్ ఒప్పందం చేసుకున్న కంపెనీ... అందరూ ఖండించారు. దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ ఈ భూములు ప్రభుత్వానివి కావని, రాణి కమలాదేవికే చెందుతాయని పదేపదే తీర్పులిచ్చాక కూడా ప్రభుత్వం వీటిని వ్యూహాత్మకంగా వారికి అప్పగించేస్తోందని ‘ఈనాడు’ రాస్తోందంటే దాని అర్థమేంటి? కోర్టు తీర్పులను అమలు చేయకూడదనా? కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోవాలనా? ఎందుకు రామోజీరావు గారూ ఈ రాతలు? రాసిందే పదేపదే రాయటం వెనక అర్థమేంటి? బుధవారం రాసిన కథనానికి సంబంధించి ‘ఈనాడు’పై పరువునష్టం దావా వేస్తామంటూ రాణి కమలాదేవి, ఆమె కుమారుడు నోటీసులివ్వగా... విశాఖపట్నం జిల్లా కలెక్టరు కూడా పరువునష్టం దావా వేస్తున్నట్లు తెలియజేశారు. చట్టపరమైన చర్యలు... ‘‘దసపల్లా భూములపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ భూములకు సంబంధించి న్యాయస్థానాలు జారీ చేసిన ఆదేశాలు ఈ నెల 23 నాటికి అమలు చేయాలని కోర్టులు స్పష్టంచేశాయి. లేకుంటే హైకోర్టుకు జిల్లా కలెక్టర్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. అందుకే కోర్టు తీర్పులను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం’’ అని పేర్కొనటంతో పాటు... ఆ భూముల చరిత్రను కూడా వివరించారు కలెక్టర్. ఇదీ... దసపల్లా భూముల కథ ► మొదటి నుంచీ రాణి కమలాదేవి కుటుంబీకుల చేతుల్లోనే ఉన్న ఈ భూములపై... సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్‌తో పలు వ్యాజ్యాలు నడిచినా... చివరకు డైరెక్టరు కూడా ఆ భూములు వారివేనని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చారు. 1985లో ఈ భూములపై తహశీల్దార్ హైకోర్టులో కేసు వేయగా... వాదోపవాదాలు విన్న న్యాయస్థానం 1992లో ఆ భూములు కమలా దేవికి చెందినవి అంటూ తీర్పునిచ్చింది. ► ఇంతలో జీవో నం. 657 విడుదల చేసి... ఆ భూముల్ని ప్రభుత్వ పోరంబోకు భూమలుగా గుర్తిస్తూ సెక్షన్ 22(ఏ)లో నమోదు చేశారు. దీనిపై 2005లో హైకోర్టులో రాణి కమలాదేవి రిట్ పిటిషన్ వేశారు. దీంతో జీవో ఈ భూములకు వర్తించదని కోర్టు తీర్పునిచ్చింది. ► నాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా ప్రభుత్వ పిటిషన్లని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో 2012లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. దాన్నీ కోర్టు డిస్మిస్ చేసింది. 2014లో రాష్ట్ర ప్రభుత్వం చివరి ప్రయత్నంగా క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. దాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ► తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం పదే పదే సుప్రీంకి వెళ్తుండటంతో రాణి కమలాదేవి 2012లో హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు వేశారు. ఇది పెండింగ్‌లో ఉండగానే... ఆ భూముల్ని 22(ఏ)లో పెట్టి నోటిఫై చేసింది ప్రభుత్వం. దీనిపై రాణి కమలాదేవి మళ్లీ కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు జిల్లా గెజిట్‌ను రద్దుచేసి... ప్రభుత్వానికి తగు సూచనలు చేయాలని అడ్వకేట్ జనరల్‌కు చెప్పింది. ఏజీ ప్రభుత్వానికి అదే సూచన చేశారు. అయినా అమలు చేయకపోవడంతో మరోసారి పిటిషనర్లు్ల కోర్టుకు వెళ్లారు. దీంతో.. దసపల్లా భూములకు సంబంధించి ఈ నెల 23 నాటికి కోర్టు ఆదేశాలు అమలు చేయాలని... లేకుంటే కలెక్టర్ హైకోర్టుకు వ్యక్తిగతంగా రావాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. ► అన్ని దారులు మూసుకుపోవడంతో పాటు కోర్టు ధిక్కార పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున, సుప్రీం ఆదేశాలను, ఏజీ సూచనను అంగీకరిస్తూ.. న్యాయస్థానాల ఆదేశాల్ని 2022 డిసెంబర్ 31న అమలు చేసినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వాస్తులు, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, రెవెన్యూ విభాగాలవిగా చెబుతున్న 18.41 ఎకరాల్ని మాత్రం 22(ఏ)లో అలాగే ఉంచినట్లు తెలిపారు. ఎవరైనా ఇంకేం చేస్తారు? ఇవీ వాస్తవాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందే కదా? అన్ని స్థాయిల్లోనూ న్యాయ పోరాటం చేసి ఓడిపోయాక... కోర్టు ధిక్కార కేసులను సైతం ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయస్థానాలు హెచ్చరించాక ఏ ప్రభుత్వమైనా ఆ ఆదేశాలను అమలు చేయక ఇంకేం చేస్తుంది? కథనాలు రాసేముందు ఈ మాత్రం ఆలోచించకపోతే ఎలా రామోజీరావు గారూ? ఈ రాతలు... మరీ ఘోరం ‘‘విశాఖలో 2002లో ఓ అపార్ట్మెంట్ కట్టారు. అందులో పిసరంత ప్రభుత్వ భూమి ఉందని మొత్తం అపార్ట్‌మెంట్‌నే 22(ఏ)లో పెట్టేశారు. ఈ సంగతి అపార్ట్మెంట్లోని ఫ్లాట్ల ఓనర్లకు ఏడెనిమిదేళ్ల కిందట తెలిసింది. అప్పటి నుంచి తిరుగుతున్నా ఇప్పటికీ 22(ఏ) నుంచి తొలగించలేదు. ఇదీ ఈ ప్రభుత్వం సామాన్యుల విషయంలో అనుసరిస్తున్న వైఖరి’’అంటూ తన కథనంలో ‘ఈనాడు’ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. మరి ఎనిమిదేళ్ల కిందట అంటే అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబునాయుడు కదా? ఐదేళ్ల పాటు ఆయనే ఉన్నారు కదా? ఐదేళ్లూ వారు 22(ఏ) నుంచి తొలగించలేదంటే ఏమని అనుకోవాలి? మరి అప్పుడెందుకు ప్రశ్నించలేదు? ఐదేళ్లూ బాబు ప్రభుత్వంలో చేయని పనిని... ఈ ప్రభుత్వం మూడేళ్లలో చేయలేదని విమర్శించటం సబబేనా? ఎందుకీ దుర్మార్గపు రాతలు రామోజీరావు గారూ? బాబు అధికారంలో ఉంటే ప్రశ్నించాల్సిన మీ కలంలో సిరా అయిపోతుందా? లేక మీ గొంతు మూగబోతుందా? -
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
కాకినాడ: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గాదం కమలాదేవి(86) గురువారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు. కమలాదేవి 1972లో జిల్లాలోని పామర్రు నియోజవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కమలాదేవి గతంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, టీటీడీ సభ్యురాలు గానూ, క్వాయర్ బోర్డ్ సభ్యురాలుగానూ విశేష సేవలందించారు. కాకినాడ నగరంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించడానికి తన వంతు సహాయం అందించారు. కమలాదేవికి రమేష్, మహేష్, హరీష్ అనే ముగ్గురు కుమారులు, అనురాధ అనే కుమార్తె ఉన్నారు. కమలాదేవి పీఏసీ చైర్మన్‌గా కూడా అప్పట్లో బాధ్యత నిర్వహించారు. కమల మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
సునీల్ చెత్రికి ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ప్రకటించిన 2017 వార్షిక అవార్డుల్లో భారత కెప్టెన్, సాకర్ స్టార్ సునీల్ చెత్రి ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. బైచుంగ్ భూటియా తర్వాత వంద అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాడిగా ఈ స్ట్రయికర్ ఘనత వహించిన సంగతి తెలిసిందే. మహిళల కేటగిరీలో ఈ అవార్డు మణిపూర్‌కు చెందిన కమలా దేవికి దక్కింది. ఇటీవల జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో రాణించిన అనిరుధ్ థాపా ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. -
మహాత్ముడినే ప్రశ్నించింది!
నిన్నంతా గూగుల్ ‘డూడుల్’లో మీరు కమలాదేవి ఛటోపాధ్యాయ్‌ని చూసి ఉంటారు. ఏప్రిల్ 3 ఆమె బర్త్‌డే. 1903లో జన్మించారు. 1988 అక్టోబర్ 29న మరణించారు. డూడుల్‌లో నృత్యం, సంగీతం, రంగస్థలం, సంస్కృతి, సంప్రదాయ రూపాలతో కమలకు గూగుల్ నివాళులు అర్పించింది. అందులో గూగుల్ మిస్ అయిన రూపం.. ఫెమినిజం! ఆ తర్వాత రాజకీయం. అవును. కమల భారతదేశంలో తొలినాళ్ల ఫెమినిస్ట్. తొలినాళ్ల మహిళా రెబలియన్. ఈ రెండు కోణాల్లో కమలా ఛటోపాధ్యాయ్ గురించి మనం తెలుసుకుని తీరాలి. కమలకు ఏడేళ్ల వయసులో తండ్రి పోయారు. అయితే ఆయన విల్లు రాయకుండా పోయారు. దాంతో ఆస్తంతా సవతి తల్లి కొడుక్కి సంక్రమించింది. కమల, ఆమె తల్లి కట్టుబట్టల్తో మిగిలిపోయారు!ఇరవై ఏళ్ల వయసులో కమల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. నిజానికి ఆమెకు ఆలోచనలేదు. ఆమె చురుకుదనం చూసి గాంధీజీ స్వయంగా ఆమెను పార్టీలోకి రమ్మని కోరారు. తర్వాత మూడేళ్లకు మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఆమె పోటీ చేశారు. 55 ఓట్ల వ్యత్యాసంతో ఓడిపోయారు. గాంధీజీ పిలుపుతో కమల రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ.. కొన్నిసార్లు ఆయన్ని విభేదించిన సందర్భాలు కూడా ఉన్నాయి! ‘దండి’ యాత్రలోకి, ‘సత్యాగ్రహ’ ప్రదర్శనల్లోకి స్త్రీలు వద్దని గాంధీజీ అన్నారు. ఎందుకు వద్దు?’ అని కమల ఆయన్ని ప్రశ్నించారు!గాంధీజీ కమలకు ఆరాధ్యులే. అయితే గాంధీజీ కోరుకున్న మార్పు వేగంగా జరగడం లేదని ఆమె భావించారు. అందుకని కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ‘కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ’ వైపు మొగ్గు చూపారు. ఆ పార్టీకి అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. అప్పుడు ఆమె వయసు 33 ఏళ్లు మాత్రమే!భారతీయ మహిళా హక్కులపై తన 26వ ఏట నుంచే కమల పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. తన జీవిత కాలం మొత్తం మీద ఇలాంటివి 20 వరకు పుస్తకాలు రాశారు ఆమె. చివరి పుస్తకం ‘ఇండియన్ ఉమెన్స్ బ్యాటిల్ ఫర్ ఫ్రీడమ్’ 1982లో పబ్లిష్ అయింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా కమల తన గళం విప్పారు. ఆఫ్రికన్ మహిళల హక్కుల కోసం పోరాడారు. -
ధీర వనిత..
చిరుత పులి ఎదురుపడితే ఎంతటివారికైనా చలి చెమటలు పట్టాల్సిందే. అలాంటి చిరుతపులితో 56ఏళ్ల పెద్దావిడ వీరోచితంగా పోరాడి దాన్ని మట్టికరిపించింది. ఆదివారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లా కోటి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం కమలాదేవి గొడ్డలి, కొడవలితో పొలానికి వెళ్లింది. పొలంపనిలో తలమునకలైన ఆమెపైకి అక్కడికి చేరుకున్న చిరుత ఒక్కసారిగా దాడిచేసింది. పొలం పనికోసం వెంటతెచ్చుకున్న పనిముట్టే ఆమెకు ఆయుధాలయ్యాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు క్షణాల్లోనే గొడ్డలి, కొడవలితో కమలాదేవి చిరుతపైకి ఎదురుదాడికి దిగింది. దాదాపు 30 నిమిషాలపాటు జరిగిన ఈ పెనుగులాటలో చిరుత చనిపోయింది. తీవ్రగాయాలపాలైన ఆమెను అనంతరం శ్రీనగర్ గర్వాల్ బేస్ ఆసుపత్రిలో స్థానికులు చేర్పించారు.