నిన్నంతా గూగుల్ ‘డూడుల్’లో మీరు కమలాదేవి ఛటోపాధ్యాయ్‌ని చూసి ఉంటారు. ఏప్రిల్ 3 ఆమె బర్త్‌డే. 1903లో జన్మించారు. 1988 అక్టోబర్ 29న మరణించారు. డూడుల్‌లో నృత్యం, సంగీతం, రంగస్థలం, సంస్కృతి, సంప్రదాయ రూపాలతో కమలకు గూగుల్ నివాళులు అర్పించింది. అందులో గూగుల్ మిస్ అయిన రూపం.. ఫెమినిజం! ఆ తర్వాత రాజకీయం. అవును. కమల భారతదేశంలో తొలినాళ్ల ఫెమినిస్ట్. తొలినాళ్ల మహిళా రెబలియన్. ఈ రెండు కోణాల్లో కమలా ఛటోపాధ్యాయ్ గురించి మనం తెలుసుకుని తీరాలి.
కమలకు ఏడేళ్ల వయసులో తండ్రి పోయారు. అయితే ఆయన విల్లు రాయకుండా పోయారు. దాంతో ఆస్తంతా సవతి తల్లి కొడుక్కి సంక్రమించింది. కమల, ఆమె తల్లి కట్టుబట్టల్తో మిగిలిపోయారు!ఇరవై ఏళ్ల వయసులో కమల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. నిజానికి ఆమెకు ఆలోచనలేదు. ఆమె చురుకుదనం చూసి గాంధీజీ స్వయంగా ఆమెను పార్టీలోకి రమ్మని కోరారు. తర్వాత మూడేళ్లకు మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఆమె పోటీ చేశారు. 55 ఓట్ల వ్యత్యాసంతో ఓడిపోయారు. గాంధీజీ పిలుపుతో కమల రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ.. కొన్నిసార్లు ఆయన్ని విభేదించిన సందర్భాలు కూడా ఉన్నాయి! ‘దండి’ యాత్రలోకి, ‘సత్యాగ్రహ’ ప్రదర్శనల్లోకి స్త్రీలు వద్దని గాంధీజీ అన్నారు. ఎందుకు వద్దు?’ అని కమల ఆయన్ని ప్రశ్నించారు!గాంధీజీ కమలకు ఆరాధ్యులే. అయితే గాంధీజీ కోరుకున్న మార్పు వేగంగా జరగడం లేదని ఆమె భావించారు.
అందుకని కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ‘కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ’ వైపు మొగ్గు చూపారు. ఆ పార్టీకి అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. అప్పుడు ఆమె వయసు 33 ఏళ్లు మాత్రమే!భారతీయ మహిళా హక్కులపై తన 26వ ఏట నుంచే కమల పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. తన జీవిత కాలం మొత్తం మీద ఇలాంటివి 20 వరకు పుస్తకాలు రాశారు ఆమె. చివరి పుస్తకం ‘ఇండియన్ ఉమెన్స్ బ్యాటిల్ ఫర్ ఫ్రీడమ్’ 1982లో పబ్లిష్ అయింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా కమల తన గళం విప్పారు. ఆఫ్రికన్ మహిళల హక్కుల కోసం పోరాడారు.
Comments
Please login to add a commentAdd a comment