ధీర వనిత..
చిరుత పులి ఎదురుపడితే ఎంతటివారికైనా చలి చెమటలు పట్టాల్సిందే. అలాంటి చిరుతపులితో 56ఏళ్ల పెద్దావిడ వీరోచితంగా పోరాడి దాన్ని మట్టికరిపించింది. ఆదివారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లా కోటి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం కమలాదేవి గొడ్డలి, కొడవలితో పొలానికి వెళ్లింది. పొలంపనిలో తలమునకలైన ఆమెపైకి అక్కడికి చేరుకున్న చిరుత ఒక్కసారిగా దాడిచేసింది.
పొలం పనికోసం వెంటతెచ్చుకున్న పనిముట్టే ఆమెకు ఆయుధాలయ్యాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు క్షణాల్లోనే గొడ్డలి, కొడవలితో కమలాదేవి చిరుతపైకి ఎదురుదాడికి దిగింది. దాదాపు 30 నిమిషాలపాటు జరిగిన ఈ పెనుగులాటలో చిరుత చనిపోయింది. తీవ్రగాయాలపాలైన ఆమెను అనంతరం శ్రీనగర్ గర్వాల్ బేస్ ఆసుపత్రిలో స్థానికులు చేర్పించారు.