
సాక్షి, హైదరాబాద్: భూములు అమ్మితే కాని ప్రభుత్వాన్ని నడపలేని స్థితి తెలంగాణ సర్కార్‌ది అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు అప్పులు.. రాష్ట్ర భూముల తాకట్టు’ అని మండిపడ్డారు. రూ. 30వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూముల అమ్మకానికి సర్కారు పన్నాగం. నాడు భూములు అమ్మొద్దని సుద్దులు, నేడు అమ్మకానికి టెండర్లు. నిధుల సమీకరణ పేరుతో అడ్డికి పావుశేరుకు భూముల అమ్మకం’’ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో వైపు, అప్పు చేసి, పప్పు కూడు నాటి సామెత అప్పు చేసి, చిప్ప కూడు నేటి కాంగ్రెస్ ఏడాది పాలన ఘనత’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘నాడు అప్పు చేసి
70 లక్షల అన్నదాతలకు అండగా నిలిచి వారికి రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు ఖాతాల్లోకి వేసి రూ.28 వేల కోట్లు రుణమాఫీ చేసి రూ.6 వేల కోట్లతో రైతుబీమా చేసి లక్ష 11 వేల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందేలా చేసి వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, పారిశ్రామిక, గృహావసరాలకు 24 కరెంటు అందించాం.
..కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సీతారామసాగర్ కట్టి 45 వేల చెరువులు కుంటలు బాగుచేసి 45 లక్షల మందికి పైగా ఆసరా ఫించన్లతో అండగా నిలిచి కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్, కళ్యాణలక్ష్మి వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు, 30 మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటుచేస్తే అప్పులు తప్పని రాద్దాంతం చేశారు’’ అని కేటీఆర్ మండిపడ్డారు. 15 నెలల పాలనలో రూ.1.65 లక్షల కోట్లు అప్పు చేసి రుణమాఫీ ఎగ్గొట్టి రైతుబంధు ఎగ్గొట్టి రైతుబీమా లేకుండా చేసి కరెంటుకు కోతలు వేసి గురుకులాలను గాలికి వదిలేసి కాళేశ్వరాన్ని ఎండబెట్టి పాలమూరు రంగారెడ్డిని పడావుపెట్డి శ్రీశైలం సొరంగం కుప్పకూల్చి 8 మంది ప్రాణాలు బలితీసుకున్న బాధ్యతలేని ప్రభుత్వం ఇది’’ అంటూ కేటీఆర్ నిలదీశారు.
తట్టెడు మట్టి తీసింది లేదు.. ఒక్క పథకం అమలు చేసింది లేదు. గల్లీలో గాలిమాటలు.. ఢిల్లీకి ధనం మూటలు మోసుడు తప్ప 15 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటి ? నాడు అప్పులు తప్పని అడ్డగోలు అభాండాలు.. నేడు అందినకాడికి అప్పులు’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment