మేనకోడలు పాత్రపై అనుమానాలు! | Suspicions on the role of niece in Jayaram murder case | Sakshi
Sakshi News home page

మేనకోడలు పాత్రపై అనుమానాలు!

Published Sun, Feb 3 2019 3:08 AM | Last Updated on Sun, Feb 3 2019 12:26 PM

Suspicions on the role of niece in Jayaram murder case - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో/హైదరాబాద్‌: కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద హైదరాబాద్‌– విజయవాడ జాతీయ రహదారి పక్కన కారులో జయరాం మృతదేహాన్ని గురువారం అర్ధరాత్రి పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. వాహనంలో ఆయన మృతదేహం పడి ఉన్న తీరును బట్టి హత్యగా భావిస్తున్న పోలీసులు.. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వివాదాలతో పాటు వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. జయరామ్‌ హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై అనుమానాలు రేకెత్తడంతో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఆమెను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను కంచికచెర్ల సర్కిల్‌ స్టేషన్‌లో ఉంచి జిల్లా ఎస్పీ త్రిపాఠి స్వయంగా విచారించారు. దాదాపు 20 గంటలపాటు విచారించినప్పటికీ అమె పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఆమెతో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని జయరామ్, శిఖా చౌదరి నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. 

జయరామ్‌ ఎక్కడెక్కడికి వెళ్లారు? 
జయరామ్‌ సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అతను ఎక్కడెక్కడికి వెళ్లాడు అనే కోణంలో కృష్ణా జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నారు. దాన్నిబట్టి మొదట దస్పల్లా హోటల్‌ వద్దకు వెళ్లి అక్కడి సీసీ టీవీ పుటేజీలను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. జయరామ్‌తో పాటు ఎవరైనా కొత్తవ్యక్తులు ఉన్నారా అనే కోణంలో హోటల్‌ సిబ్బందిని విచారించారు. హోటల్‌ వద్ద జయరామ్‌కు ఓ వ్యక్తి రూ. ఆరు లక్షలు ఇచ్చాడని, హోటల్‌ గది అప్పటికే ఓ యువతి పేరుమీద ఉన్నట్లు సమాచారం. హోటల్‌ నిర్వాహకులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు.

శిఖా చౌదరి పాత్రపై అనుమానాలు.. 
శిఖా చౌదరి.. జయరామ్‌కు మేనకోడలు, వ్యాపార భాగస్వామి. జయరామ్‌ ప్రారంభించిన ఏ వ్యాపారంలోనైనా ఈమె డైరెక్టర్‌గా వ్యవహరించారు. అతను నిర్వహించిన ఓ న్యూస్‌ చానల్‌లోనూ శిఖా చౌదరి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన భార్యా పిల్లల కంటే ఈమెకే జయరామ్‌ ప్రాముఖ్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల శిఖా సోదరి మనీషా చదువు కోసం రూ. కోటి వరకు జయరామ్‌ చెల్లించినట్లు సమాచారం. జయరామ్‌ ఎప్పుడు అమెరికా నుంచి వచ్చినా శిఖా ఇంటికి రాత్రిపూట వచ్చి వెళ్లేవాడని ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ చెబుతున్నాడు. గత నెల 29న రాత్రి కూడా ఆమె ఇంటికి జయరాం వచ్చి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జయరామ్‌ హత్యకు గురైన రోజున రాత్రి 11 గంటలకు ఇంటి నుంచి శిఖా చౌదరి ఒంటరిగా కారు తీసుకుని హడావుడిగా వెళ్లినట్లు విచారణలో తేలింది.

హైదరాబాద్‌లోనే హత్యకు స్కెచ్‌!
హత్య కేసులో నందిగామ పోలీసులకు పలు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా హైదరాబాద్‌ కేంద్రంగా జయరామ్‌ హత్యకు కుట్ర జరిగినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై జయరామ్‌ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, కోస్టల్‌ బ్యాంక్‌ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మేనకోడలు పాత్రపై ఆరా తీశారు. దస్పల్లా హోటల్‌లో జయరామ్‌ పేరిట 10 రోజులుగా ఓ రూమ్‌ బుక్‌ చేయడం, అదే హోటల్‌లో గురువారం ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశం జరగడం, అక్కడి నుంచే జయరామ్‌ ఓ తెల్లచొక్కా ధరించిన వ్యక్తితో కలిసి కారులో వెళ్లినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. పతంగి టోల్‌గేట్‌ వద్ద నమోదైన సీసీ టీవీ ఫుటేజీలోనూ జయరామ్‌తోపాటు మరో ఇద్దరు ప్రయాణించినట్లు తేలింది. తెల్లచొక్కా ధరించిన వ్యక్తి కారు నడిపినట్లు గుర్తించారు. కారులో లభ్యమైన మద్యం బాటిళ్లు తదితరాలను బట్టి ఈ హత్యకు హైదరాబాద్‌లోనే కుట్ర పన్నినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

రాకేష్‌ ఎవరనే కోణంలో ఆరా..
జయరామ్‌ చెల్లులు సుశీలతోపాటు మేనకోడళ్లు శిఖా చౌదరి, మనీషాలతోపాటు డ్రైవర్‌ సతీష్‌తోపాటు గన్‌మెన్లను పోలీసులు విచారిస్తున్నారు. అదే సందర్భంలో మేనకోడలు శిఖా చౌదరి ప్రియుడుగా భావిస్తున్న రాకేష్‌ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. శిఖా చౌదరికి రాకేష్‌ రూ. 4.5 కోట్లు అప్పు ఇచ్చినట్లు సమాచారం. ఈ డబ్బుల విషయంలో రెండేళ్లుగా రాకేష్‌–శిఖా మధ్య గొడవలు జరుగుతున్నాయని, తన మేనకోడలి అప్పును తీరుస్తానని జయరామ్‌ హామీ ఇచ్చారని, అయితే ఆ తర్వాత డబ్బు సర్దుబాబు చేయకపోవడంతోనే వీరి ముగ్గురి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఆ వివాదమే హత్యకు దారితీసిందా? అన్న కోణంలో రాకేష్‌ను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. శ్రీకాంత్‌ అనే మరో యువకుడిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ఎంపీ తమ్ముడి కొడుకుతోనూ శిఖాకు పరిచయాలున్నాయని, బీర్‌ కంపెనీ పెడతానని అతని ద్వారా భారీగా పెట్టుబడి పెట్టించినట్లు విచారణలో తేలింది.

ఆ సమయంలో ఏం జరిగింది?
జయరాం స్వస్థలం విజయవాడ కాగా గత నెల 30న హైదరాబాద్‌ నుంచి బయల్దేరారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద గత నెల 31వ తేది రాత్రి 2గంటలకు ఆయన కారు సీసీ పుటేజీలో కనిపించింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ చేరుకోవడానికి 5 గంటల సమయం పడుతుంది. ఈ మిగతా సమయం ఎక్కడున్నాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కీలకం కానున్న ఫోరెన్సిక్‌ నివేదిక
అనుమానస్పద స్థితిలో మృతి చెందిన జయరామ్‌ మృతదేహంపై పలు భాగాల్లో గట్టిగా దెబ్బలు తగిలిన దాఖలాలేమి కనిపించలేదు. మోచేయి కింద భాగంలో, పొట్ట ఎడమ వైపున, కుడివైపు ఛాతీ పైభాగంలోనూ కందిన గాయాలున్నాయి. ముక్కు, నోటి నుంచి రక్తం ధారగా కారింది. చేతులు నల్లగా ఉండడం, శరీరంలో నీలిరంగులోకి మారడంతో ఆయనపై ఏదైనా విషప్రయోగం చేశారా? కొట్టి హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం సందర్భంగా శరీర భాగాలను వైద్యులు సేకరించి విశ్లేషణ కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. అక్కడి నుంచి నివేదిక అందాకే హత్య మిస్టరీ వీడే అవకాశం ఉందని పోలీసు భావిస్తున్నారు

కేన్సర్‌ ఆస్పత్రిలో మృతదేహం
జయరామ్‌ మృతదేహాన్ని శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు తరలించారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 44లోని ఇంట్లో గత కొద్దిరోజులుగా జయరామ్‌ ఒక్కరే ఉంటున్నట్లు తెలుస్తోంది. అతడి భార్యా, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. ఇదిలాఉండగా జయరామ్‌ భార్య పద్మశ్రీ, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ప్లోరిడాలో మంచు తుఫాను వల్ల హైదరాబాద్‌ రావడానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నట్లు తెలుస్తున్నది. ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని భావించినా సాధ్యమయ్యేట్లు కనిపించడం లేదు.

గది తాళాలు ఇవ్వాలని దౌర్జన్యం చేసింది: వాచ్‌మెన్‌ వెంకటేశ్‌ 
జయరామ్‌ మృతిచెందిన మరుసటిరోజు శిఖా చౌదరి జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 44లోని జయరామ్‌ ఇంటికి వచ్చి రూం తాళాలు ఇవ్వాలని దౌర్జన్యం చేసినట్లు జయరామ్‌ ఇంటి వాచ్‌మెన్‌ వెంకటేశ్‌ తెలిపాడు. తాను తాళాలు ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. అదే సమయంలో ఆమెకు ఫోన్‌ రావడంతో వెళ్లిపోయినట్లు తెలిపాడు. ఆ రోజు రాత్రి డ్యూటీకి రాగానే జయరామ్‌ సార్‌కు ఫోన్‌ చేశానని, మీటింగ్‌లో ఉన్నాను తర్వాత ఫోన్‌ చేస్తానని చెప్పాడన్నాడు. ఆ తర్వాత గన్‌మెన్‌ ద్వారా జయరామ్‌ మృతి విషయం తెలిసిందని, ఎవరు హత్య చేశారో అంతు చిక్కడంలేదన్నారు. రెండేళ్ల కిందట జయరామ్‌ తల్లి చనిపోయిన సమయంలో శిఖా చౌదరికి, జయరామ్‌ కుటుంబ సభ్యుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయని చెప్పాడు. తాను గత 20 ఏళ్లుగా జయరామ్‌ కంపెనీలో ఎలక్ట్రీషన్‌గా, వ్యక్తిగత సహాయకుడిగా, ఇంటి కాపలాదారుగా పనిచేస్తున్నట్లు తెలిపాడు. జయరామ్‌ వైన్‌ తప్ప మద్యం తాగడని ఆయన స్పష్టం చేశాడు.

ఎవరిని అదుపులోకి తీసుకోలేదు : సర్వశ్రేష్ఠ త్రిపాటి, ఎస్పీ
కంచికచెర్ల సర్కిల్‌ పోలీసు స్టేషన్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు జయరామ్‌ హత్య కేసుకు సంబంధించి ఆయన కోడళ్లు, డ్రైవర్, గన్‌మెన్లతోపాటు మరో ముగ్గురు అనుమానితులను ఎస్పీ త్రిపాఠి విచారించారు. ఈ సందర్బంగా ఆయన సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. ‘జయరామ్‌ హత్య కేసులో తాము ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. కేవలం అనుమానితులను మాత్రమే విచారణ చేస్తున్నాం. త్వరలోనే కేసుని ఛేదిస్తాం’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement