చిన్న బాస్‌ క్లాస్‌మేట్‌.. విశాఖ భూములపై ‘కిలాడీ’ కన్ను | Little Boss Classmate Focus On Visakhapatnam lands | Sakshi
Sakshi News home page

చిన్న బాస్‌ క్లాస్‌మేట్‌.. విశాఖ భూములపై ‘కిలాడీ’ కన్ను

Jan 12 2025 12:17 PM | Updated on Jan 12 2025 12:28 PM

Little Boss Classmate Focus On Visakhapatnam lands

డీ–పట్టా భూములను దోచుకునేందుకు పక్కాగా ప్లాన్‌ 

భీమిలి, ఆనందపురం ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి 

రెవెన్యూ అధికారుల ద్వారా వివరాల సేకరణ 

 ప్రధాని పర్యటన ఏర్పాట్లలోనూ హడావుడి

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కోట్ల విలువైన విశాఖ భూములపై ‘కిలాడీ’ కన్ను పడింది. ఫ్రీ–హోల్డ్‌ భూములను చేజిక్కించుకునేందుకు చిన్న బాస్‌ క్లాస్‌మేట్‌ కిలాడీ విశాఖలో మకాం వేసినట్టు తెలుస్తోంది. ప్రధాని పర్యటన సమయంలో ఇక్కడకు వచ్చిన సదరు కిలాడీ భీమిలి, ఆనందపురంతో పాటు సబ్బవరం తదితర ప్రాంతాల్లోని విలువైన భూముల వివరాలను సేకరించినట్టు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే ప్రభుత్వ వ్యవహారాల్లో చిన్న బాస్‌ మిత్రుడిగా ‘శానా’ అతిచేస్తున్న మరో నేత కూడా కలిసి ఈ వ్యవహారాలు చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది. 20 ఏళ్ల క్రితం రైతులకు కేటాయించిన డీ–పట్టా భూములను ఫ్రీ–హోల్డ్‌ చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

తద్వారా వాటిని తమ అవసరాలకు వినియోగించుకునేందుకు రైతులకు అవకాశం కల్పించింది. అయితే, కొత్త ప్రభుత్వం వీటిపై గత కొద్ది నెలలుగా నిషేధం విధించింది. రానున్న మూడేళ్ల కాలంలో ఫ్రీ–హోల్డ్‌ కానున్న (20 ఏళ్లు పూర్తయిన) భూముల వివరాలనే సదరు కిలాడీ టీమ్‌ సేకరిస్తోంది. కొంతమంది రెవెన్యూ అధికారుల ద్వారా వివరాలను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వివాదాస్పద భూములపై కూడా వీరి కన్ను పడింది. స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల మాటకు విలువ లేకుండా ఇప్పటికే చక్రం తిప్పుతున్న సదరు కిలాడీ టీమ్‌.. మొత్తం భూ దందాను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్టు రెవెన్యూ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది.  

ఫ్రీ–హోల్డ్‌ భూములపై కన్ను! 
వాస్తవానికి రైతుల వద్ద 20 ఏళ్ల నుంచి ఉన్న డీ–పట్టా భూములను తమ అవసరాల కోసం వినియోగించుకునేందుకు వీలుగా ఫ్రీ–హోల్డ్‌ చేసేందుకు గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. విశాఖ జిల్లాలో సుమారు 100 ఎకరాల భూములు మాత్రమే ఫ్రీ–హోల్డ్‌ జరిగింది. దీనిపై ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ నేతలు అనేక ఆరోపణలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ జరిపించారు. ఎటువంటి అవకతవకలు జరగలేదని ఈ ప్రభుత్వం నియమించుకున్న అధికారులే తేలి్చచెప్పారు. మరోవైపు ఫ్రీ–హోల్డ్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. 

20 ఏళ్లు పూర్తయిన డీ–పట్టా భూములను రిజిస్ట్రేషన్  చేయకుండా ఆదేశాలు జారీ చేసింది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈలోగా ఈ భూములను కొట్టేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సదరు కిలాడీ కాస్తా విశాఖపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 20 ఏళ్లు పూర్తయిన వాటితో పాటు రానున్న 3 ఏళ్లల్లో ఏయే భూములు ఫ్రీ–హోల్డ్‌ అయ్యే అవకాశం ఉందో... ఆ వివరాలను సేకరిస్తున్నారు. తద్వారా ఆయా రైతుల నుంచి వీటిని కారుచౌకగా కొట్టేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సదరు కిలాడీ ఇక్కడే మకాం వేసినట్టు సమాచారం

ప్రధాని పర్యటన ఏర్పాట్లలోనూ..! 
వాస్తవానికి ఆయనకు ప్రభుత్వంలో ఎటువంటి అధికారిక పదవి లేదు. కేవలం చిన్న బాస్‌ మిత్రుడని మాత్రమే అందరికీ తెలుసు. ఇప్పటికే అమరావతిలో చిన్న బాస్‌ ఆదేశాలతో పూర్తిస్థాయిలో అన్ని వ్యవహారాలను చక్కదిద్దుతున్న సదరు కిలాడీ.. ఇప్పుడు విశాఖలోనూ చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారికంగా ఎటువంటి హోదా లేకపోయినప్పటికీ... ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులతో కలిసి ఏయూ గ్రౌండ్స్‌లో హల్‌చల్‌ చేశారు. అధికారులకు ఆదే శాలు ఇస్తూ ఏర్పాట్లపై సమీక్షించారు. 

ఎటువంటి హోదా లేకపోయినప్పటికీ చిన్న బాస్‌ క్లాస్‌ మేట్‌ హోదాలో సకల వ్యవహారాలు సదరు కిలాడీనే చూసుకుంటున్నారన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. సాక్షాత్తూ ప్రధాని పర్యటన ఏర్పాట్ల వ్యవహారంలోనూ జిల్లా లోని అధికారులకు కూడా ఈ విషయం అర్థమైనట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో సదరు కిలాడీ భీమి లి, ఆనందపురం, సబ్బవరం తదితర ప్రాంతాల్లోని ఫ్రీ–హోల్డ్‌ భూములపై వివరాలు సేకరించారు. ఆయా రెవెన్యూ అధికారుల ద్వారా వివరాలు తీసుకొని.. రైతుల నుంచి చౌకగా కొట్టేసి... ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత తమకు చెందేలా వ్యవహారాలు సర్దుబాటు చేసుకుంటున్నారని తెలుస్తోంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement