లండన్: పోయిన కంటిచూపును తెప్పించడంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారు మాంచెస్టర్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు రే ఫ్లిన్‌కు చూపు తెప్పించారు. ఎనిమిదేళ్ల క్రితం కంటిచూపు పోయి కష్టపడుతున్న ఫ్లిన్‌కు కృత్రిమ రెటినాను అమర్చి, దానికి కంప్యూటర్, వీడియో కెమెరాను అనుసంధానించి సరికొత్త పద్ధతిలో కంటిచూపు తెప్పించారు. అందుకోసం వీడియో కెమెరాతో కూడిన ప్రత్యేక కళ్లజోడు తయారు చేయించారు.
అది ఎలా పనిచేస్తుందంటే...
కళ్లజోడు మధ్యనున్న ఓ చిన్న వీడియో కెమెరా మన ముందున్న దృశ్యాలను చిత్రీకరించి వాటిని వెంట వెంటనే మెడలో వేలాడే చిన్న కంప్యూటర్‌కు పంపిస్తుంది. ఆ కంప్యూటర్ వాటిని విద్యుత్ ప్రచోదనాలు (ఎలక్ట్రికల్ ఇంపల్సెస్)గా మార్చి వాటిని కనుగుడ్డు పక్కన అమర్చిన చిన్న యాంటెన్నాకు కేబుల్ అక్కర్లేకుండానే పంపుతుంది. అక్కడి నుంచి చిన్న కేబుల్ ద్వారా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కాస్తా ఎలక్ట్రోడ్స్‌గా మారి, కంటి రెటినా ఉపరితలం పైకి వెళ్లి, అక్కడ వీడియో దృశ్యాలను ప్రతిబింబిస్తాయి. అలాగే, ఎలక్ట్రోడ్స్ రెటీనా కణాలను ప్రేరేపిస్తాయి. తద్వారా మెదడు వీడియో గ్రాహక చిత్రాలను గుర్తిస్తుంది. రెటీనా దెబ్బతిన్న ఓ వృద్ధుడికి ఇలా చూపు తెప్పించడం ప్రపంచంలో ఇదే మొదటి సారని, ఇలాంటి ప్రయోగం చేయడం కూడా మొదటిసారేనని మాంచెస్టర్ రాయల్ ఐ హాస్పటల్ సర్జన్స్ తెలియజేస్తున్నారు.
మొన్నటివరకు ఎవరో ఒకరి సహాయం లేకుండా బయటకు వెళ్లలేక పోయిన ఫ్లిన్ ఇప్పుడు ఎవరి సహాయం లేకుండానే చక్కగా పార్క్‌కు వెళ్లి వాకింగ్ చేస్తున్నానని చెబుతున్నారు. మరీ వీడియోలో రికార్డయినంత స్పష్టంగా దృశ్యాలను చూడలేమని, ఏ వస్తువునైనా పోల్చుకోగలమని, ఔట్‌లైన్స్‌ను బట్టి పేపర్ కూడా చదవొచ్చని ఆస్పత్రి ఆప్తల్మాలజిస్ట్ ప్రొఫెసర్ పావులో స్టాంగ్ తెలిపారు. కళ్లు మూసుకున్నా కంటి ముందు వస్తువులు కనిపించడం ఈ చూపులోవున్న విశిష్టతని ఆయన వివరించారు. ఎందుకంటే మూసుకున్నది కళ్లుగానీ వీడియో కెమెరా కన్ను కాదు కదా! పుట్టుకతో గుడ్డివాళ్లకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చూపు తెప్పించడం ఎలా అన్న అంశంపై తాము పరిశోధనలు కొనసాగిస్తున్నామని చెప్పారు.
కళ్లు మూసుకున్నా కనిపిస్తుంది
Published Wed, Jul 22 2015 5:26 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM
Advertisement