టోక్యో: 1964 తర్వాత ఒలింపిక్స్ క్రీడల నిర్వహణను జపాన్ ప్రభుత్వం దక్కించుకోవడం మళ్లీ ఇదే. ఈ ఒలింపిక్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ ప్రభుత్వం నిర్వహణలోనూ సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతుంది. క్రీడా గ్రామాన్ని రూపొందించడం దగ్గరి నుంచి పతకాల తయారీ వరకు వినూత్న మార్గాలను ఎంచుకుంది. ఆధునికతను, సంప్రదాయాన్ని జోడించి పతకాలను తయారు చేసింది.
అయితే ఒలింపిక్స్ మెడల్స్‌ను వినూత్న రీతిలో తయారు చేయాలని జపాన్ ప్రభుత్వం ముందే నిర్ణయించింది. అందుకోసం మూడేళ్ల క్రితం ఆ దేశ వాసుల నుంచి పాత మొబైల్ ఫోన్లను సేకరించింది. అందులోని లోహ విడిభాగాలను వేరు చేసి వాటిని కరిగించి మెడల్స్‌ను తయారు చేశారు. ఆధునాతన కంప్యూటర్ డిజైన్లతో అత్యంత అద్భుతంగా పతకాలను రూపొందించారు. దీని ద్వారా అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రానిక్ చెత్తను ఒక మంచి పనికి ఉపయోగించారు.
అంతేకాదు ఒలింపిక్స్ మెడల్ ట్యాగ్‌లను కూడా సంప్రదాయపద్దతిలోనే తయారు చేసింది. దేశీయంగా తయారు చేసిన దారాలతో ఈ ట్యాగ్‌లను నేయించింది. దీంతో పాటు పతకాలను ఉంచేందుకు... కలపతో ప్రత్యేక డబ్బాలను కూడా రూపొందించింది. జపాన్ సంప్రదాయం ఉట్టిపడే రీతిలో ఉన్న ఈ మెడల్స్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే కరోనా నేపథ్యంలో ఆటగాళ్లు తాము గెలుచుకున్న పతకాలు ఎవరికి వారే మెడలో వేసుకోవాలని జపాన్ ప్రభుత్వంతో పాటు ఐవోసీ(ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ) నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment