టోక్యో: విశ్వక్రీడల్లో ప్రత్యేకించి స్విమ్మింగ్‌లో అమెరికా ముద్ర చెరగనిది. వాళ్లు కొలనులో దిగారంటే ప్రత్యర్థులంతా హడలెత్తాల్సిందే! అంతటి స్విమ్మింగ్ మెరికలను రష్యన్లు ఓడించారు. కనీసం రజతమైనా దక్కకుండా మొదటి రెండు స్థానాల్లో రష్యా స్విమ్మర్లే నిలిచారు. 1992 బార్సిలోనా ఒలింపిక్స్ అనంతరం పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో అమెరికన్ స్విమ్మర్లు కంగుతినడం ఇదే మొదటిసారి. గత ఆరు ఒలింపిక్స్ క్రీడల్లో అమెరికా స్విమ్మర్లు బ్యాక్‌స్ట్రోక్ (100 మీ. 200 మీ.) ఈవెంట్స్‌లో 12 బంగారు పతకాలు గెలిచారు.
కానీ టోక్యోలో ఈ ఘనమైన ఒలింపిక్ రికార్డుకు చుక్కెదురైంది. రష్యాకు చెందిన ఎవ్‌గెని రిలోవ్ 51.98 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం నెగ్గగా, అతని సహచరుడు క్లిమెంట్ కొలెస్నికోవ్ (52.00 సెకన్లు) రజతం గెలిచాడు. డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ రియాన్ మర్ఫీ (అమెరికా; 52.19 సెకన్లు) చివరకు కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. మహిళల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో ఆమెరికా 17 ఏళ్ల టీనేజర్ లిడియా జాకబి (1ని:04.95 సెకన్లు) స్వర్ణం, డిఫెండింగ్ చాంపియన్ లిల్లీ కింగ్ (1ని:05.54 సెకన్లు; అమెరికా) కాంస్యం గెలుపొందగా, దక్షిణాఫ్రికా స్విమ్మర్ టజాన షోన్‌మకెర్ (1ని:05.22 సెకన్లు) రజతం చేజిక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment