పసిడి కాంతులు... | Tokyo Paralympics: Manoj Sarkar Bags Bronze, Pramod Bhagat Wins Gold | Sakshi
Sakshi News home page

పసిడి కాంతులు...

Published Sun, Sep 5 2021 6:42 AM | Last Updated on Sun, Sep 5 2021 7:24 AM

Tokyo Paralympics: Manoj Sarkar Bags Bronze, Pramod Bhagat Wins Gold - Sakshi

మునుపెన్నడూ లేని విధంగా దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత క్రీడాకారులు తమ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా పతకాల పంట పండిస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. టోక్యో పారాలింపిక్స్‌కు నేటితో తెర పడనుండగా... శనివారం భారత దివ్యాంగ క్రీడాకారులు రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలను గెల్చుకున్నారు.

షూటింగ్‌లో మిక్స్‌డ్‌ 50 మీటర్ల పిస్టల్‌ ఎస్‌హెచ్‌–1 ఫైనల్లో మనీశ్‌ నర్వాల్‌ పసిడి పతకం నెగ్గగా... సింగ్‌రాజ్‌ అధానా రజత పతకం కైవసం చేసుకున్నాడు. పారాలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన బ్యాడ్మింటన్‌లోనూ భారత షట్లర్లు మెరిశారు. పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌–3 విభాగంలో ప్రపంచ చాంపియన్‌ ప్రమోద్‌ భగత్‌ బంగారు పతకం సాధించగా... మనోజ్‌ సర్కార్‌ కాంస్య పతకం దక్కించుకున్నాడు.

టోక్యో: పారాలింపిక్స్‌లో మరోసారి భారత క్రీడాకారులు తమ ప్రతాపం చూపించారు. శనివారం ఏకంగా నాలుగు పతకాలతో అదరగొట్టారు. ముందుగా షూటింగ్‌లో మనీశ్‌ నర్వాల్‌... సింగ్‌రాజ్‌ అధానా... అనంతరం బ్యాడ్మింటన్‌లో ప్రమోద్‌ భగత్, మనోజ్‌ సర్వార్‌ పతకాలు సొంతం చేసుకున్నారు. మిక్స్‌డ్‌ 50 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో 19 ఏళ్ల మనీశ్‌ నర్వాల్‌ 218.2 పాయింట్లు స్కోరు చేసి పారాలింపిక్‌ రికార్డు సృష్టించడంతోపాటు అగ్రస్థానంలో నిలిచాడు. 39 ఏళ్ల సింగ్‌రాజ్‌ 216.7 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఈ క్రీడల్లో సింగ్‌రాజ్‌కిది రెండో పతకం కావడం విశేషం. ఇంతకుముందు 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో సింగ్‌రాజ్‌ కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనతో ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా, ఓవరాల్‌గా మూడో భారత ప్లేయర్‌గా సింగ్‌రాజ్‌ గుర్తింపు పొందాడు. 1984 పారాలింపిక్స్‌లో అథ్లెట్‌ జోగిందర్‌ సింగ్‌ బేడీ మూడు పతకాలు గెల్చుకోగా... ప్రస్తుత పారాలింపిక్స్‌లో మహిళా షూటర్‌ అవనీ లేఖరా రెండు పతకాలు సాధించింది.

ఫుట్‌బాలర్‌ కావాలనుకొని...
హరియాణాకు చెందిన 19 ఏళ్ల మనీశ్‌ జన్మతః కుడి చేతి వైకల్యంతో జని్మంచాడు. కొన్నాళ్లు ఫుట్‌బాల్‌ ప్రాక్టీస్‌ చేసి క్లబ్‌ స్థాయిలో మ్యాచ్‌లు కూడా ఆడిన మనీశ్‌ కుడి చేతి వైకల్యం కారణంగా ఎక్కువ రోజులు ఫుట్‌బాల్‌లో కొనసాగలేకపోయాడు. ఆ తర్వాత తండ్రి దిల్‌బాగ్‌ మిత్రుడొకరు మనీశ్‌కు షూటింగ్‌ను పరిచేయం చేశాడు. స్థానిక 10ఎక్స్‌ షూటింగ్‌ అకాడమీలో చేరిన మనీశ్‌ రెండేళ్లలో ఆటపై పట్టు సాధించాడు. 2018లో ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణం, రజతం సాధించాడు. ఆ తర్వాత 2019 వరల్డ్‌ పారా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు గెలిచాడు.

ప్రమోదం నింపిన విజయం
టోక్యో పారాలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు సూపర్‌ ప్రదర్శన చేశారు. పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌–4 విభాగంలో ఒడిశాకు చెందిన 33 ఏళ్ల ప్రమోద్‌ భగత్‌ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఫైనల్లో టాప్‌ సీడ్‌ ప్రమోద్‌ 21–14, 21–17తో రెండో సీడ్‌ డానియెల్‌ బెథెల్‌ (బ్రిటన్‌)ను ఓడించాడు. ‘ఈ విజయం నాకెంతో ప్రత్యేకం. నా కల నిజమైంది. ఈ పతకాన్ని నా తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నాను’ అని ప్రమోద్‌ వ్యాఖ్యానించాడు. నాలుగేళ్ల వయసులో పోలియో బారిన పడ్డ ప్రమోద్‌ ఇరుగు పొరుగు వారు బ్యాడ్మింటన్‌ ఆడుతుండగా ఈ ఆటపై ఆసక్తి ఏర్పరచుకున్నాడు. 2006లో పారా బ్యాడ్మింటన్‌లో అడుగుపెట్టిన ప్రమోద్‌ ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 45 పతకాలను సాధించాడు. ఇందులో నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్‌ స్వర్ణ పతకాలు ఉండటం విశేషం.  

మరోవైపు ఎస్‌ఎల్‌–4 విభాగంలోనే భారత్‌కు చెందిన మనోజ్‌ సర్కార్‌ కాంస్యం సాధించాడు. కాంస్య పతక పోరులో మనోజ్‌ 22–20, 21–13తో దైసుకె ఫుజిహారా (జపాన్‌)పై విజయం సాధించాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన 31 ఏళ్ల మనోజ్‌ ఏడాది వయసులో పోలియో బారిన పడ్డాడు. ఐదేళ్ల వయసులో బ్యాడ్మింటన్‌ వైపు ఆకర్షితుడైన మనోజ్‌ ఆటపై పట్టు సంపాదించి 2013, 2015, 2019 ప్రపంచ చాంపియన్‌íÙప్‌ డబుల్స్‌ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించాడు.

చివరి రోజు భారత ప్లేయర్లు 5 పతకాలపై గురి పెట్టారు. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌–4 విభాగంలో ఐఏఎస్‌ అధికారి సుహాస్‌ యతిరాజ్‌ స్వర్ణం కోసం... తరుణ్‌ కాంస్యం కోసం... ఎస్‌హెచ్‌ –6 విభాగంలో కృష్ణ నాగర్‌ స్వర్ణం కోసం... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రమోద్‌–పలక్‌ ద్వయం కాంస్యం కోసం పోటీపడతారు. షూటింగ్‌ మిక్స్‌డ్‌ 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ విభాగంలో సిద్ధార్థ, దీపక్, అవని బరిలో ఉన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement