మాస్కో: ఇప్పటికే డోపింగ్ ఉచ్చులో పీకల్లోతు మునిగిన రష్యాకు మరో చేదు ఫలితం ఎదురైంది. లండన్ ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెట్లు నెగ్గిన మహిళల 4X400 మీటర్ల రిలే రజతాన్ని నిర్వాహకులు వెనక్కి తీసుకోనున్నారు. ఈ రిలే ఈవెంట్‌లో మిగతా ముగ్గురితో కలిసి పోటీపడిన రష్యా అథ్లెట్ అంటోనినా క్రివోషప్క నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో రజతం వెనక్కి తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది. దీంతో కాంస్యం నెగ్గిన జమైకాకు రజతం, నాలుగో స్థానంలో ఉన్న ఉక్రెయిన్‌కు కాంస్యం ప్రకటించింది. ఇందులో అమెరికా స్వర్ణం గెలిచింది. లండన్ ఈవెంట్‌లో పోటీపడిన అథ్లెట్ల రక్త, మూత్ర నమూనాలను తిరిగి పరీక్షించగా కొందరి క్రీడాకారులవి పాజిటివ్ రిపోర్ట్‌లు వస్తున్నాయి.