కాంస్యం... రజతంగా మారింది | Wrestler Yogeshwar Dutt confirms upgrade to silver for London Olympics | Sakshi
Sakshi News home page

కాంస్యం... రజతంగా మారింది

Published Wed, Aug 31 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

కాంస్యం... రజతంగా మారింది

కాంస్యం... రజతంగా మారింది

* లండన్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో యోగేశ్వర్‌కు రజతం
* 2012లో కాంస్యం సాధించిన భారత స్టార్
* రష్యా రెజ్లర్ డోపింగ్‌లో దొరకడంతో యోగేశ్వర్‌కు వెండి పతకం  

న్యూఢిల్లీ: భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్‌కు అదృష్టం కలిసొచ్చింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో తను సాధించిన కాంస్యం... నాలుగేళ్ల తర్వాత రజతంగా మారింది. ఆ గేమ్స్‌లో రజతం సాధించిన రష్యా రెజ్లర్ కుదుఖోవ్ డోపింగ్ పరీక్షలో పాజిటివ్ ఫలితం రావడంతో తన పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో యోగేశ్వర్‌కు రజతం దక్కింది.

లండన్ ఒలింపిక్స్ పురుషుల 60 కేజీ ఫ్రీస్టయిల్ విభాగం ప్రి కార్టర్ ఫైనల్లో రష్యా రెజ్లర్ బెసిక్ కుదుఖోవ్ చేతిలో యోగేశ్వర్ ఓటమి పాలయ్యాడు. కాగా,  కుదుఖోవ్ ఫైనల్‌కు చేరడంతో యోగేశ్వర్‌కు రెప్‌చేజ్ అవకాశం దక్కింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న భారత రెజ్లర్ కాంస్య పతకం సాధించాడు. మరోవైపు ఫైనల్లో కుదుఖోవ్ ఓడి రజతంతో సంతృప్తి చెందాడు. అయితే ఇటీవల అంతర్జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) నిర్వహించిన డోపింగ్ పరీక్షలో ఈ రష్యా అథ్లెట్ నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు తేలింది.

లండన్ ఒలింపిక్స్‌కు ముందు తీసుకున్న అతడి శాంపిల్‌ను మరోసారి పరీక్షించగా ఈ విషయం నిర్ధారణయియంది. దీంతో అతడు సాధించిన రజతాన్ని వెనక్కి తీసుకుని మూడో స్థానంలో నిలిచిన యోగేశ్వర్‌కు అప్‌డేట్ చేయనున్నారు. అయితే నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, బీజింగ్ గేమ్స్‌లో కాంస్యం సాధించిన కుదుఖోవ్ 2013లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం విషాదం. మరోవైపు తన పతకం మారిన విషయాన్ని రెజ్లర్ యోగేశ్వర్ ధృవీకరించాడు. ‘నేను ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్యాన్ని రజత పతకానికి అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు మంగళవారం ఉదయం సమాచారం అందింది.

ఈ పతకాన్ని కూడా దేశ ప్రజలకు అంకితమిస్తున్నాను’ అని యోగేశ్వర్ ట్వీట్ చేశారు. అయితే యోగేశ్వర్‌కు మెడల్ అప్‌గ్రేడ్ చేసే అంశాన్ని  యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీతో పాటు భారత రెజ్లింగ్ సమాఖ్య  అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. తాజాగా రియోలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో యోగేశ్వర్ 65 కిలోల విభాగంలో తొలి రౌండ్‌లోనే ఓడి నిరాశపరిచాడు. లండన్ గేమ్స్‌లోనే మరో రెజ్లర్ సుశీల్ కుమార్ కూడా రజతం సాధించాడు. భారత రెజ్లింగ్ చరిత్రలో ఇప్పటివరకూ ఇదే అత్యుత్తమ పతకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement