రియోలోనూ ఆడతా..
ముంబై: బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో జరిగే 2016 ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగుతానని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ స్పష్టం చేశాడు. గత లండన్ ఒలింపిక్స్ సమయంలో జట్టు ఎంపికలో నెలకొన్న వివాదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. 2012లో జరిగిన ఒలింపిక్స్‌లో పేస్‌తో కలిసి డబుల్స్ ఆడేందుకు మహేశ్ భూపతి, రోహన్ బోపన్న నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో పేస్‌కు జతగా హైదరాబాదీ విష్ణువర్ధన్‌ను అఖిల భారత టెన్నిస్ సమాఖ్య ఎంపిక చేసింది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియాతో బరిలోకి దిగాడు. ‘చివరి ఒలింపిక్స్ కారణంగా నా మనసు గాయపడింది. ఇంకా అది నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ కారణమే రియోకి వెళ్లడానికి ప్రేరణగా నిలుస్తోంది. మరోవైపు భారత క్రీడలు సందిగ్ధావస్థలో ఉన్నాయి. భారత ఒలింపిక్ సంఘంపై వేటు కారణంగా మన అథ్లెట్లు జాతీయ పతాకం చేతబూని పాల్గొనే వీలుండదు. అయితే అప్పటిలోగా అన్ని సమస్యలు సమసిపోతాయని అనుకుంటున్నాను’ అని పేస్ అన్నాడు.
గంగూలీ, పేస్‌కు త్వరలో సన్మానం
కోల్‌కతా: సౌరవ్ గంగూలీ, లియాండర్ పేస్‌లను జీవిత సాఫల్య పురస్కారంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సన్మానించనుంది. ఈనెల 28న ఈ కార్యక్రమం జరుగుతుంది.