భూపతితో కలిసి ఆడేదిలేదు
అతనివల్లే ‘లండన్’లో ప్రతికూల ఫలితం
2016 రియో ఒలింపిక్స్‌లో ఆడతా
పేస్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: మహేశ్ భూపతి కారణంగానే 2012 లండన్ ఒలింపిక్స్‌లో పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయానని భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ లియాండర్ పేస్ అన్నాడు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకోవడం తన జీవితంలోనే అత్యంత గొప్ప గౌరవమన్న పేస్.. తన కెరీర్‌లో లండన్ ఒలింపిక్స్ వివాదం అత్యంత విచారకరమైనదన్నాడు. తన కెరీర్ గురించి, రానున్న 2016 రియో డి జనీరో ఒలింపిక్స్ క్రీడల గురించి పేస్ అభిప్రాయాలు అతని మాటల్లోనే..
లండన్ ఒలింపిక్స్‌లో నాతో కలిసి ఆడనని భూపతి మొండి వైఖరి కారణంగా పతకం సాధించే అవకాశం చేజారింది. దేశం కూడా ఓ పతకాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అదంతా గతం. అయితే భవిష్యత్తులో మళ్లీ భూపతితో జతకట్టే అవకాశమే లేదు.
2016లో జరిగే రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా లక్ష్యం. ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉన్నందున అందుకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి.
సెర్బియాతో డేవిస్ కప్ టోర్నీలో ఆడాల్సిందిగా అఖిల భారత టెన్నిస్ సంఘం కోరితే అందుకు సిద్ధంగా ఉన్నాను.
భూపతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న టెన్నిస్ లీగ్‌కు బిజీ షెడ్యూల్‌లో ఐపీఎల్ మాదిరిగా రెండు, మూడు వారాల సమయం లభించడం కష్టం. అంతర్జాతీయ టాప్‌స్టార్లు ఈ లీగ్‌లో ఆడేది అనుమానమే. ఫెడరర్, షరపోవా వంటి వారు ఇంకా సంతకం చేయలేదు. నా లీ ఇప్పటికే తప్పుకుంది. ప్రజల తరపున పోరాడేందుకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే సిద్ధమే.