నిరూపించుకోవాల్సిన అవసరం లేదు!
లియాండర్ పేస్ వ్యాఖ్య
కోల్‌కతా: సుదీర్ఘ కెరీర్‌లో ఎంతో సాధిం చిన తాను ఇక కొత్త గా నిరూపించుకునేదేమీ లేదని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ అన్నాడు. ఈ ఏడాది డేవిస్ కప్ జట్టు నుంచి ఈ వెటరన్ ఆటగాడిని నాన్– ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి తప్పించాడు. అయితే టెన్నిస్‌నే ప్రేమించే తాను సత్తా ఉన్నంత కాలం ఆడతానని, ఇప్పట్లో రిటైర్మెంట్ యోచనే లేదని తేల్చి చెప్పాడు. ‘నేను ఎవరిముందు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. నేనేంటో నా కెరీరే సమాధానమిస్తుంది. ఈ వయసు లోనూ టెన్నిస్ ఆడుతున్నానంటే దానికి కారణం... నేను టెన్నిస్‌ను అమితంగా ప్రేమించడమే.
దేశం తరఫున ఎన్నో విజయాలు సాధించాను. గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో ఆడేది వ్యక్తిగతమైనా... బరిలోకి దిగేది మాత్రం... మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించేందుకే’ అని పేస్ భావోద్వేగంతో చెప్పాడు. వచ్చే ఏడాది మరిన్ని టైటిల్స్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నాడు. 2018లో కొత్త మిక్స్‌డ్ డబుల్స్ భాగస్వామితో బరిలోకి దిగుతానని, మళ్లీ విజయాలు సాధిస్తానని అతను చెప్పాడు.