davis cup team
-
క్వార్టర్ ఫైనల్లో సాకేత్
సాక్షి, హైదరాబాద్: వోల్వో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6–4, 6–4తో తక్ కున్ వాంగ్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. ఈ మ్యాచ్‌లో సాకేత్ తొమ్మిది ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన సాకేత్, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో శశికుమార్ ముకుంద్ 1–6, 6–3, 6–3తో రెండో సీడ్ జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా)పై సంచలన విజయం సాధించాడు. -
సాకేత్ పరాజయం
సాక్షి, హైదరాబాద్: కున్మింగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు, భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని పోరాటం ముగిసింది. చైనాలోని ఆనింగ్ నగరంలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సాకేత్ 2–6, 4–6తో భారత్‌కే చెందిన రెండో సీడ్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ చేతిలో ఓడిపోయాడు. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఒక్కసారి కూడా బ్రేక్ చేయలేకపోయిన సాకేత్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) 6–4, 6–4తో యాన్ బాయ్ (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. -
పేస్‌కు అవకాశం!
న్యూఢిల్లీ: భారత వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్‌కు మళ్లీ డేవిస్ కప్ ఆడే అవకాశం ఇస్తారో లేదో నేడు తేలనుంది. వచ్చే నెల చైనాతో జరిగే పోరు కోసం భారత డేవిస్ జట్టును ఆదివారం ఎంపిక చేయనున్నారు. ఈ సెలక్షన్స్‌లో పేస్ పేరును పరిశీలిస్తామని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) వర్గాలు పేర్కొన్నాయి. ‘కెనడాతో జరిగిన డేవిస్ పోరులో డబుల్స్‌లో భారత జోడీ గెలిచి ఉంటే వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించే అవకాశముండేది. అదే లియాండర్ పేస్ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది’ అని ఏఐటీఏ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. అయితే నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి, డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్నలతో పేస్‌కు సఖ్యత లేనపుడు ఇదేలా సాధ్యమని విలేకర్లు ప్రశ్నించగా... ముందు వ్యక్తిగత విబేధాలు పక్కనబెట్టాలని, దేశ ప్రయోజనాలనే చూడాలని సమాధానమిచ్చారు. గత ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోరుకు కూడా పేస్‌ను దూరంగా ఉంచారు. దుబాయ్‌లో జరిగిన ఏటీపీ టోర్నీలో రన్నరప్‌గా నిలవడంతో లియాండర్ పేస్ డబుల్స్ ర్యాంకుల్లో మళ్లీ టాప్–50లోకి వచ్చాడు. -
నిరూపించుకోవాల్సిన అవసరం లేదు!
లియాండర్ పేస్ వ్యాఖ్య కోల్‌కతా: సుదీర్ఘ కెరీర్లో ఎంతో సాధిం చిన తాను ఇక కొత్త గా నిరూపించుకునేదేమీ లేదని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ అన్నాడు. ఈ ఏడాది డేవిస్ కప్ జట్టు నుంచి ఈ వెటరన్ ఆటగాడిని నాన్– ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి తప్పించాడు. అయితే టెన్నిస్‌నే ప్రేమించే తాను సత్తా ఉన్నంత కాలం ఆడతానని, ఇప్పట్లో రిటైర్మెంట్ యోచనే లేదని తేల్చి చెప్పాడు. ‘నేను ఎవరిముందు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. నేనేంటో నా కెరీరే సమాధానమిస్తుంది. ఈ వయసు లోనూ టెన్నిస్ ఆడుతున్నానంటే దానికి కారణం... నేను టెన్నిస్‌ను అమితంగా ప్రేమించడమే. దేశం తరఫున ఎన్నో విజయాలు సాధించాను. గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో ఆడేది వ్యక్తిగతమైనా... బరిలోకి దిగేది మాత్రం... మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించేందుకే’ అని పేస్ భావోద్వేగంతో చెప్పాడు. వచ్చే ఏడాది మరిన్ని టైటిల్స్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నాడు. 2018లో కొత్త మిక్స్డ్ డబుల్స్ భాగస్వామితో బరిలోకి దిగుతానని, మళ్లీ విజయాలు సాధిస్తానని అతను చెప్పాడు. -
కనీస సమాచారం ఇవ్వలేదు!
భారత జట్టు నుంచి తొలగించడంపై బోపన్న స్పందన బెంగళూరు: డేవిస్ కప్ జట్టునుంచి తనను అకారణంగా తప్పించడంపై భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టును ప్రకటించిన విషయం తనకు మీడియా ద్వారానే తెలిసిందని అతను అన్నాడు. ‘న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు నేను అందుబాటులో ఉండగలనా అని మెయిల్ పంపించారు. నేను సిద్ధమేనని రెండు రోజుల్లోనే జవాబిచ్చాను. కానీ జట్టును ఎంపిక చేసినట్లు గానీ, నన్ను తప్పించిన విషయం గానీ ‘ఐటా’ లేదా కోచ్ జీషాన్ అలీ ఎవరూ సమాచారం ఇవ్వలేదు. అసలు ఏ ప్రాతిపదికన జట్టును ఎంపిక చేశారో కూడా తెలీదు’ అని బోపన్న వ్యాఖ్యానించాడు. మరోవైపు రాబోయే సీజన్లో బోపన్న డబుల్స్‌లో కొత్త భాగస్వామితో బరిలోకి దిగనున్నాడు. ఉరుగ్వేకు చెందిన పాబ్లో క్వాస్తో కలిసి అతను ఆడతాడు. ప్రపంచ 28వ ర్యాంకర్ బోపన్న, గత రెండేళ్లుగా రొమేనియా ఆటగాడు ఫ్లోరిన్ మెర్జియాతో కలిసి ఆడాడు. వీరిద్దరు కలిసి రెండు టైటిల్స్ గెలుచుకోగా, మరో ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచారు. -
క్వార్టర్స్‌లో సాకేత్
సాక్షి, హైదరాబాద్: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేని సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి... డబుల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఉజ్బెకిస్థాన్‌లోని కర్షి పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్లో సాకేత్ 7-6 (7/4), 6-2తో యాంటెల్ వాండెర్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడైన సాకేత్ 11 ఏస్‌లు సంధించడంతోపాటు 4 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఇక డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ మైనేని-జేమ్స్ క్లుస్కీ (ఐర్లాండ్) జోడి 7-6 (7/5), 6-3తో చేజ్ బుచానన్ (అమెరికా)-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జంటపై గెలిచింది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో నికొలజ్ బాసిలాష్విలి (జార్జియా)తో సాకేత్; డబుల్స్ సెమీఫైనల్లో సెర్గీ బెటోవ్-అలెగ్జాండర్ బురీ (బెలారస్) జోడితో సాకేత్-క్లుస్కీ ద్వయం పోటీపడుతుంది. -
డేవిస్‌కప్ ఫైనల్లో సెర్బియా
బెల్గ్రేడ్: ప్రతిష్టాత్మక డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో సెర్బియా జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం కెనడాతో ముగిసిన సెమీఫైనల్లో సెర్బియా 3-2తో విజయం సాధించింది. శనివారం 1-2తో వెనుకబడిన సెర్బియా ఆదివారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో గెలిచింది. తొలి సింగిల్స్‌లో జొకోవిచ్ 7-6 (7/1), 6-2, 6-2తో రావ్నిక్పై నెగ్గి స్కోరును 2-2వద్ద సమం చేశాడు. నిర్ణాయక మ్యాచ్‌లో టిప్సరెవిచ్ 7-6 (7/3), 6-2, 7-6 (8/6) తో పోస్పిసిల్ను ఓడించి సెర్బియాకు విజయాన్ని అందించాడు. నవంబరు 15 నుంచి 17 వరకు జరిగే ఫైనల్లో చెక్ రిపబ్లిక్‌తో సెర్బియా ఆడుతుంది.