ప్రతీ ఒక్క అథ్లెట్ అంతిమ లక్ష్యం ఒలింపిక్స్ పతకం సాధించడమే అనడంలో సందేహం లేదు. ఆశయాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ధీటుగా నిలబడి కలను పండించుకుని.. మెడల్స్ మెడలో వేసుకునే వారు ‘విజేతలు’గా ప్రశంసలు అందుకుంటారు.
అయితే.. గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేక ఆఖరి మెట్టుపై బోల్తా పడి నిరాశతో వెనుదిరిగిన వాళ్లు ‘పరాజితులు’గా మిగిలిపోతారు. ప్యారిస్ ఒలింపిక్స్-2024 నేపథ్యంలో.. అలా పతకం గెలిచే దిశగా వచ్చి ఓటమితో ముగించిన భారత క్రీడాకారుల గురించి తెలుసుకుందాం.
ఫుట్‌బాల్ జట్టు
మెల్‌బోర్న్ ఒలింపిక్స్-1956లో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టుకు ఇలాంటి పరాభవం ఎదురైంది. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను క్వార్టర్ ఫైనల్లో 4-2తో ఓడించిన భారత్ సెమీస్‌కు దూసుకువెళ్లింది.
నాడు మన ఆటగాడు నివిల్లే డిసౌజా ఆసీస్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టి ఈ ఘనత సాధించిన తొలి ఆసియా ఫుట్‌బాలర్‌గా నిలిచాడు.
సెమీ ఫైనల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తాడని భావించిన వాళ్లకు నిరాశే ఎదురైంది. యుగోస్లేవియాతో సెమీస్‌లో భారత్ ఆరంభంలో గట్టిపోటీనిచ్చినా ద్వితీయార్థ భాగంలో అనూహ్యంగా పుంజుకుంది ప్రత్యర్థి. ఫలితంగా భారత్ ఓటమిపాలైంది.
ఈ క్రమంలో కాంస్యం కోసం బల్గేరియా జట్టుతో పోటీపడ్డ భారత ఫుట్‌బాల్ టీమ్ 0-3తో ఓడి పతకాన్ని చేజార్చుకుంది.
‘ఫ్లైయింగ్ సిఖ్’ హృదయం ముక్కలైన వేళ..
రోమ్ ఒలింపిక్స్-1960లో భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ తృటిలో కాంస్య పతకం కోల్పోయాడు. 400 మీటర్ల పరుగు పందెంలో.. ప్రత్యర్థుల వేగాన్ని అంచనా వేసే క్రమంలో చూపు తిప్పిన మిల్కాకు అదే శాపమైంది.
ప్రత్యర్థిని గమనించే క్రమంలో వేగం తగ్గించిన మిల్కా.. సెకనులో పదో వంతు తేడాతో వెనకబడి నాలుగోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తన జీవితంలో అత్యంత చేదు జ్ఞాపకంగా ఈ అనుభవం మిగిలిపోయింది.
ఆ తర్వాత రెండేళ్లకు ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు గెలిచినా ఒలింపిక్ పతకం చేజారిన తీరును తాను మరువలేనని దివంగత మిల్కా సింగ్ గతంలో ఓం సందర్భంలో తెలిపారు.
భారత మహిళా హాకీ జట్టు చేజారిన మెడల్
1980లో తొలిసారిగా భారత మహిళా హాకీ జట్టు విశ్వ క్రీడల్లో పాల్గొంది. ఆ యేడు మాస్కోలో జరిగిన ఒలింపిక్స్‌కు నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్ వంటి మేటి జట్లు దూరంగా ఉన్నాయి.
నాడు యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లికన్స్(యూఎస్‌ఎస్‌ఆర్) అఫ్గనిస్తాన్‌పై దురాక్రమణకు పాల్పడిన తీరును నిరసిస్తూ.. క్రీడల్లో పాల్గొనకుండా బాయ్‌కాట్ చేశాయి. ఈ క్రమంలో భారత మహిళా జట్టుకు పెద్దగా పోటీ లేకుండా పోవడంతో పతకంతో తిరిగి వస్తుందనే ఆశ చిగురించింది.
అయితే, యూఎస్‌ఎస్‌ఆర్‌తో చివరగా తలపడ్డ భారత్ 1-3తో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
పరుగుల రాణికి చేదు అనుభవం
లాస్ ఏంజెల్స్-1984 ఒలింపిక్స్‌లో ఉషపైనే భారత్ ఆశలు పెట్టుకుందిపెట్టుకుంది. అయితే, మిల్కా సింగ్ మాదిరే ఆమె కూడా తృటిలో పతకం చేజార్చుకుంది.
400 మీటర్ల హార్డిల్స్ పోటీలో సెకనులో వందో వంతు తేడాతో వెనుకబడ్డ ఈ ‘పయ్యోలీ ఎక్స్‌ప్రెస్’ హృదయం ముక్కలైంది. రొమేనియాకు చెందిన క్రిస్టియానా కోజోకరో మూడోస్థానంలో నిలవగా.. పీటీ ఉష పతకం లేకుండా రిక్త హస్తాలతో వెనుదిరిగింది.
టెన్నిస్‌లో చేజారిన కాంస్యం
లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి భారత్ కాంస్యానికి చేరువగా వచ్చింది. అయితే, పాత కథే పునరావృతమైంది.
ఈసారి టెన్నిస్ మెన్స్ డబుల్స్‌లో భారత్‌కు పరాభవం ఎదురైంది. లియాండర్ పేస్- మహేశ్ భూపతి ద్వయం క్రొయేషియా జోడీ మారియో ఆన్సిక్- ఇవాన్ జుబిసిక్‌తో జరిగిన మారథాన్ మ్యాచ్‌లో 6-7 6-4 14-16 తేడాతో ఓడిపోయారు.
కాంస్యం కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో ఓటమి ఎదురుకావడంతో నిరాశగా నిష్క్రమించారు. అంతకు ముందు సెమీస్‌లో జర్మనీ జంట నికోలస్ కీఫర్- రైనెర్ షట్లర్ చేతిలో పరాజయం పాలై ఫైనల్స్ చేరే సువర్ణావకాశం చేజార్చుకున్నారు పేస్- భూపతి.
ఇక ఇదే ఒలింపిక్స్‌లో భారత మహిళా వెయిట్ లిఫ్టర్ కుంజరాణి దేవీ సైతం 48 కేజీల విభాగంలో ఫైనల్ అటెంప్ట్‌లో డిస్‌క్వాలిఫై అయింది.
మొత్తంగా 190 కిలోలు ఎత్తిన కుంజరాణి బ్రాంజ్ మెడలిస్ట్ ఆరీ విరాథ్వార్న్(థాయిలాండ్) కంటే పది కేజీలు తక్కుగా లిఫ్ట్ చేసినందుకు పతకానికి దూరమైంది.
లండన్ ఒలింపిక్స్‌లోనూ ఇలాగే
ఈసారి షూటింగ్‌లో భారత్ పతకానికి చేరువగా వచ్చింది. జోయ్‌దీప్ కర్మాకర్ మెన్స్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో ఫైనల్ చేరాడు. బ్రాండ్ మెడల్ విజేత కంటే 1.9 పాయింట్లు వెనుకబడి కాంస్యం గెలిచే అవకాశం పోగొట్టుకున్నాడు.
మరో‘సారీ’ ఇదే ‘కర్మ’
భారత్ నుంచి ఒలింపిక్స్‌లో తొలిసారిగా జిమ్నాస్టిక్స్ విభాగంలో తలపడిన మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్. రియో డి జెనిరో-2016 ఒలింపిక్స్‌లో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ త్రిపుర అమ్మాయి.. నాలుగో స్థానంలో నిలిచింది.
కాంస్యం గెలిచిన అమ్మాయి.. దీపా స్కోరు చేసిన పాయింట్లకు వ్యత్సాసం 0.150 కావడం గమనార్హం.
టోక్యోలోనూ కలిసిరాలేదు
దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత టోక్యో ఒలింపిక్స్-2020లో భాగంగా భారత మహిళా హాకీ జట్టు మరోసారి పతకం గెలిచే అవకాశం ముంగిట నిలిచింది.
క్వార్టర్ ఫైనల్‌లో అనూహ్య రీతిలో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టిన రాణీ రాంపాల్ బృందంపై ప్రశంసల జల్లు కురిసింది.
అయితే, కీలకమైన సెమీస్‌లో అర్జెంటీనా చేతిలో ఓటమి తప్పలేదు. దీంతో స్వర్ణం ఆశ చేజారినా.. కాంస్యం గెలుస్తారనే నమ్మకం మాత్రం చావలేదు.
అయితే, గ్రేట్ బ్రిటన్ జట్టు భారత్ ‘కంచు’ ఆశలపై నీళ్లు చల్లింది. 4-3తో ఓడించి కాంస్యాన్ని ఎగురేసుకుపోయింది. ఈ ఓటమితో భారత జట్టుతో పాటు వంద కోట్లకు పైగా భారతీయుల హృదయాలూ ముక్కలయ్యాయి.
ఇదే ఒలింపిక్స్‌లో గోల్ఫర్ అదితి అశోక్ కూడా ఇలాగే నాలుగో స్థానంతో సరిపెట్టుకుని చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది.
ఇప్పటి వరకు ఎన్ని పతకాలంటే..
విశ్వ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 35 పతకాలు గెలిచింది. భారత హాకీ పురుషుల జట్టు 1928- 1956 మధ్య కాలంలో వరుసగా ఆరుసార్లు పసిడి పతకాలు గెలిచింది.
ఆ తర్వాత 1964, 1980లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఇక మళ్లీ షూటర్ అభినవ్ బింద్రా, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మాత్రమే భారత్‌కు పసిడి అందించారు.
చదవండి: పక్షవాతాన్ని జయించి.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో టీమిండియా స్టార్!
Comments
Please login to add a commentAdd a comment