Paris Olympics: మేరీ కోమ్‌ రాజీనామా.. కారణం ఇదేనన్న పీటీ ఉష | Sakshi
Sakshi News home page

Paris Olympics: మేరీ కోమ్‌ రాజీనామా ప్రకటన.. కారణం ఇదేనన్న పీటీ ఉష

Published Fri, Apr 12 2024 5:28 PM

Mary Kom Steps Down As Chef De Mission Of India Paris Olympics Contingent - Sakshi

భారత దిగ్గజ బాక్సర్‌, వరల్డ్‌ మాజీ చాంపియన్‌ మేరీ కోమ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్యారిస్‌ ఒలింపిక్స్‌ నేపథ్యంలో ఇండియా చెఫ్‌ డీ మిషన్‌ బాధ్యతల నుంచి వైదొలిగారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా మేరీ కోమ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయాన్ని భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు పీటీ ఉష ధ్రువీకరించారు. తనను చెఫీ డీ మిషన్‌ బాధ్యతల నుంచి తప్పించాలంటూ మేరీ కోమ్‌ లేఖ రాసినట్లు వెల్లడించారు. ఈ మేరకు.. ‘‘దేశానికి సేవ చేసే ఏ అవకాశాన్నైనా నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తాను.

ఈ బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వర్తించడానికి మానసికంగా సంసిద్ధమయ్యాను. కానీ ఇప్పుడు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. నా వ్యక్తిగత కారణాల దృష్ట్యా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాను. 

ఇలా చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ఇంతకంటే నాకు వేరే మార్గం కనిపించడం లేదు. ఒలింపిక్స్‌లో నా దేశం తరఫున ఆడే అథ్లెట్లందరికీ ఎల్లవేళలా మద్దతుగా ఉంటాను’’ అని 41 ఏళ్ల మేరీ కోమ్‌ పీటీ ఉషకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

కాగా ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో పాల్గొననున్న భారత జట్టుకు మెంటార్‌గా సేవలు అందించేందుకు చెఫ్‌ డీ మిషన్‌గా మేరీ కోమ్‌ను నియమించింది ఒలింపిక్‌ అసోసియేషన్‌. మార్చి 21న ఇందుకు సంబంధించి ప్రకటన చేసింది. అయితే, తాజాగా మేరీ కోమ్‌ ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు.

ఈ నేపథ్యంలో మేరీ కోమ్‌ రాజీనామానకు ఆమోదించామని.. ఆమె స్థానంలో కొత్త వారిని త్వరలోనే నియమిస్తామంటూ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ పీటీ ఉష ప్రకటించారు. కాగా మణిపూర్‌కు చెందిన మేరీ కోమ్‌.. ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచారు. 2021 లండన్‌ ఒలింపిక్స్‌లో ఈ లెజెండరీ బాక్సర్‌ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement