PC : Instagram/@sukhjeet_22
సంకల్ప బలం గట్టిగా ఉంటే.. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ సుఖ్‌జీత్ సింగ్. పక్షవాతం బారినా పడినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి.. తన కలను నిజం చేసుకున్నాడు.
హాకీ ఆటగాడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుని విశ్వ క్రీడల్లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. పంజాబ్‌లోని జలంధర్‌లో 1996లో జన్మించాడు సుఖ్‌జీత్ సింగ్. అతడి తండ్రి అజిత్ సింగ్ పంజాబ్ పోలీస్ విభాగంలో పనిచేసేవాడు.
తండ్రిని చూసి
పోలీస్ టీమ్ తరఫున హాకీ ఆడే తండ్రిని చూసి చిన్ననాటి నుంచే గమనించిన సుఖ్‌జీత్.. ఆటపై మక్కువ పెంచుకున్నాడు. ఆరో ఏటనే హాకీ స్టిక్ చేతబట్టి ఓనమాలు నేర్చాడు.
నాటి నుంచి తండ్రి ప్రోత్సాహంతో భారత జట్టులో చోటే లక్ష్యంగా శ్రమించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ లక్ష్యానికి చేరువగా వచ్చాడు. కానీ.. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు పక్షవాతం రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది.
తాత్కాలిక పక్షవాతం
ఆరేళ్ల క్రితం వెన్నునొప్పి బారిన పడిన సుఖ్‌జీత్.. కుడికాలు తాత్కాలిక పక్షవాతానికి గురైంది. దీంతో అతడి కలలు కల్లగానే మిగిలిపోతాయేమోనని కుటుంబం భయపడింది. అయితే, తండ్రి ప్రోత్సాహం, తన సంకల్ప బలం వల్ల సుఖ్‌జీత్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.
భారత జట్టు తరఫున అరంగేట్రం చేసి తానేంటో నిరూపించుకున్నాడు. తద్వారా ప్యారిస్ ఒలింపిక్స్-2024 జట్టులో స్థానం సంపాదించాడు ఈ ఫార్వర్డ్ ప్లేయర్. ఈ నేపథ్యంలో తన ప్రయాణం గురించి మాట్లాడుతూ..
ఐదు నెలలు మంచానికే పరిమితం
‘‘ఒలింపిక్స్ ఆడటం నా కల. నా కుటుంబం కూడా ఇదే కోరుకుంది. నాకు దక్కిన గొప్ప గౌరవం ఇది. కఠినంగా శ్రమిస్తే కచ్చితంగా ఫలితం వస్తుందని నేను నమ్ముతాను.
ఇప్పుడు అది మరోసారి నిరూపితమైంది. జట్టు ప్రయోజనాలే ప్రధానంగా ఆడుతాను. నాపై నమ్మకం ఉంచిన కోచ్‌లు, సహచర ఆటగాళ్లు తలెత్తుకునేలా చేస్తాను.
ఇక హాకీ ఆడలేమోనని భయపడ్డా
అయితే, ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా పాక్షిక పక్షవాతం కారణంగా ఐదు నెలలు మంచానికే పరిమితం కావాల్సిన దుస్థితి వచ్చింది.
నా జీవితంలో అత్యంత కఠినమైన దశ అదే. శారీరకంగా.. మానసికంగా చాలా చాలా అలసిపోయాను. నడవలేకపోయాను. కనీసం నా పనులు కూడా నేను చేసుకోలేకపోయాను.
ఇక హాకీ ఆడలేమోనని భయపడ్డాను. అయితే, మా నాన్న నన్ను తేలికగా తలవంచనీయలేదు. నొప్పిని భరించేలా తన మాటలతో ఉపశమనం కలిగించారు. నాలో స్ఫూర్తిని రగిల్చారు.
ఆయన వల్లే నేను కోలుకోగలిగాను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం ప్యారిస్ ఒలింపిక్స్‌పైనే ఉంది. నా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాను’’ అని సుఖ్‌జీత్ సింగ్ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశాడు.
పసిడి గెలిచిన జట్లలో సభ్యుడు
కాగా రెండేళ్ల క్రితం సుఖ్‌జీత్ భారత జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. FIH Pro League 2021-2022 సీజన్‌లో స్పెయిన్‌తో మ్యాచ్ సందర్భంగా ఎంట్రీ ఇచ్చిన అతడు ఇప్పటి వరకు 70 మ్యాచ్‌లు ఆడి.. 20 గోల్స్ స్కోరు చేశాడు.
భువనేశ్వర్‌లో జరిగిన హాకీ వరల్డ్‌కప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన సుఖ్‌జీత్.. మూడు గోల్స్ కొట్టాడు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో పసిడి పతకం గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు.
గతేడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన జట్టులోనూ సుఖ్‌జీత్ ఉన్నాడు. మైదానంలో పాదరసంలా కదులుతూ డిఫెన్స్ స్ప్లిట్టింగ్ పాస్‌లు మూవ్ చేసే సుఖ్‌జీత్‌కు, టీమిండియాకు ఆల్ ది బెస్ట్!..
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా భారత్ తొలుత న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. పూల్-బిలోని ఇరు జట్ల మధ్య జూలై 27న ఈ మ్యాచ్ జరుగనుంది.
చదవండి: ఏడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనున్న మాక్సీ!.. కారణం అదే!
Comments
Please login to add a commentAdd a comment