న్యూపోర్ట్ (అమెరికా): భారత దిగ్గజ టెన్నిస్ క్రీడాకారులు లియాండర్ పేస్, విజయ్ అమృత్‌రాజ్‌లకు గొప్ప గౌరవం లభించింది. ఈ ఇద్దరికీ అంతర్జాతీయ టెన్నిస్ ‘హాఫ్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించారు. ఆసియా నుంచి ఈ గౌరవం పొందిన టెన్నిస్ క్రీడాకారులు వీరిద్దరే కావడం విశేషం. 51 ఏళ్ల పేస్ వరుసగా ఏడు ఒలింపిక్స్ క్రీడల్లో (1992 బార్సిలోనా నుంచి 2016 రియో వరకు) పోటీపడ్డ ఏకైక టెన్నిస్ క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు.
1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో వ్యక్తిగత సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన పేస్ డేవిస్‌కప్‌లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో పురుషుల డబుల్స్‌లో 8 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో 10 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను గెల్చుకున్న పేస్‌కు ‘ప్లేయర్ కేటగిరీ’లో హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ఎంపిక చేశారు.
ఆదివారం జరిగిన కార్యక్రమంలో మహిళా దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ మార్టినా నవ్రతిలోవా చేతుల మీదుగా పేస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ పతకాన్ని అందుకున్నాడు. మరోవైపు 70 ఏళ్ల విజయ్ అమృత్‌రాజ్ 1974, 1987లలో భారత జట్టు డేవిస్‌కప్ ఫైనల్‌కు చేరుకోవడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటి వరకు 28 దేశాల నుంచి 267 మంది టెన్నిస్ ప్లేయర్లకు ‘హాఫ్ ఆఫ్ ఫేమ్’లో స్థానాన్ని కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment