
Leander Paes- Mahesh Bhupathi Web Series Break Point: వ్యక్తిగతంగా ఒకరితో మరొకరికి పడకపోయినా కోర్టులో దిగితే మాత్రం కలిసి కట్టుగా అద్భుత విజయాలు సాధించడం తమకే చెల్లిందని భారత టెన్నిస్ స్టార్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతి నిరూపించారు. దశాబ్దానికిపైగా భారత టెన్నిస్ ముఖ చిత్రంగా ఉన్న వీరిద్దరు 1994–2006, 2008–2011 మధ్య డబుల్స్ జోడీగా చిరస్మరణీయ ప్రదర్శన చేశారు. 1999లో జరిగిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోరీ్నల్లో (ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్)నూ పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు చేరిన ఈ జంట... ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌ల్లో విజేతలుగా నిలిచింది. అనంతరం 2001 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ జోడి మరోసారి చాంపియన్‌గా నిలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
ఈ నేపథ్యంలో వీరిని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ అంటూ భారతీయులు కీర్తించారు. అయితే ఈ గొప్ప ఘనతలు సాధించే సమయంలో తమ మధ్య సఖ్యత లేదని వీరు వ్యాఖ్యానించారు. అయినా ఏదో తెలియని సోదరభావం తమని కలిసి ఆడేలా చేసిందని వీరు పేర్కొన్నారు. పేస్, భూపతిల ఆట, అనుబంధం, స్పర్ధలు, గెలుపోటములు... ఇలా ఇప్పటి వరకు ఎక్కడా చెప్పని పలు ఆసక్తికర అంశాలతో ‘బ్రేక్ పాయింట్’ అనే వెబ్ సిరీస్ నిర్మితమైంది. దీనికి సంబంధించిన ట్రయిలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేస్, భూపతి అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. అశ్విని అయ్యర్ తివారి, నితీశ్ తివారిల దర్శకత్వంలో రూపొందిన ‘బ్రేక్ పాయింట్’ ‘జీ5’ ఓటీటీలో అక్టోబర్ 1న విడుదల కానుంది.