Indian tennis players
-
Leander Paes- Mahesh Bhupathi: విభేదాల్లోనూ విజయాలు!
Leander Paes- Mahesh Bhupathi Web Series Break Point: వ్యక్తిగతంగా ఒకరితో మరొకరికి పడకపోయినా కోర్టులో దిగితే మాత్రం కలిసి కట్టుగా అద్భుత విజయాలు సాధించడం తమకే చెల్లిందని భారత టెన్నిస్ స్టార్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతి నిరూపించారు. దశాబ్దానికిపైగా భారత టెన్నిస్ ముఖ చిత్రంగా ఉన్న వీరిద్దరు 1994–2006, 2008–2011 మధ్య డబుల్స్ జోడీగా చిరస్మరణీయ ప్రదర్శన చేశారు. 1999లో జరిగిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోరీ్నల్లో (ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్)నూ పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు చేరిన ఈ జంట... ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ల్లో విజేతలుగా నిలిచింది. అనంతరం 2001 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ జోడి మరోసారి చాంపియన్‌గా నిలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో వీరిని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ అంటూ భారతీయులు కీర్తించారు. అయితే ఈ గొప్ప ఘనతలు సాధించే సమయంలో తమ మధ్య సఖ్యత లేదని వీరు వ్యాఖ్యానించారు. అయినా ఏదో తెలియని సోదరభావం తమని కలిసి ఆడేలా చేసిందని వీరు పేర్కొన్నారు. పేస్, భూపతిల ఆట, అనుబంధం, స్పర్ధలు, గెలుపోటములు... ఇలా ఇప్పటి వరకు ఎక్కడా చెప్పని పలు ఆసక్తికర అంశాలతో ‘బ్రేక్ పాయింట్’ అనే వెబ్ సిరీస్ నిర్మితమైంది. దీనికి సంబంధించిన ట్రయిలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేస్, భూపతి అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. అశ్విని అయ్యర్ తివారి, నితీశ్ తివారిల దర్శకత్వంలో రూపొందిన ‘బ్రేక్ పాయింట్’ ‘జీ5’ ఓటీటీలో అక్టోబర్ 1న విడుదల కానుంది. -
‘ఆ ముగ్గురు’ కలిసి పని చేయాలి!
మొనాకో: ఈతరం భారత టెన్నిస్ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు సాధించాలంటే ముగ్గురు దిగ్గజాలు లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా కలిసి పని చేయాలని మాజీ వరల్డ్ నంబర్‌వన్, జర్మన్ స్టార్ బోరిస్ బెకర్ అభిప్రాయపడ్డాడు. టెన్నిస్ అభివృద్ధి కోసం కాకుండా ఈ ముగ్గురు తమలో తాము కలహించుకోవడం తాను చూస్తున్నానని అతను అన్నాడు. గత కొంత కాలంగా డబుల్స్ భాగస్వాముల విషయంలో పేస్, భూపతి, సానియా వివాదంలో భాగమయ్యారు. వీరి మధ్య విభేదాలు బహిరంగంగా రచ్చకెక్కాయి. ఇదే విషయాన్ని బెకర్ గుర్తు చేశాడు. ‘టెన్నిస్‌లో భారత్ గతంలో మంచి ఫలితాలు సాధించింది. అయితే ఇప్పుడు కూడా పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్ల అవసరం ఉంది. వారిలో కొందరన్నా మరింత ముందుకు వెళ్లి ఫలితాలు సాధిస్తారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు కానీ మున్ముందు విజయాలు దక్కవచ్చు. దేశంలో ఆటకు మంచి ఆదరణ కూడా ఉంది. పేస్, భూపతి, సానియాలాంటి వారి అవసరం ఇప్పుడు దేశానికి ఉంది. వారు ఆట కోసం ఏదైనా చేయాలి. వారి మధ్య గొడవలు ఉన్నాయనే విషయం నాకు తెలుసు. కానీ ముగ్గురు కలిసి పని చేయడమొక్కటే పరిష్కార మార్గం’ అని బెకర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఫెడరర్ 20 గ్రాండ్‌స్లామ్‌ల ఘనతను తాజా ఫామ్ ప్రకారం చూస్తే వచ్చే రెండేళ్లలో నొవాక్ జొకోవిచ్ అధిగమిస్తాడని బెకర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఓటమిని ఒప్పుకోని తత్వం ఉన్న జొకోవిచ్ అద్భుత రీతిలో పునరాగమనం చేయడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని కూడా అతను అన్నాడు. జొకోవిచ్‌కు 2014–16 మధ్య బెకర్ కోచ్‌గా వ్యవహరించగా... ఆ సమయంలో సెర్బియా స్టార్ ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచాడు. -
ఆక్లాండ్‌లో పేస్... సిడ్నీలో బోపన్న
కొత్త ఏడాది భారత టెన్నిస్ ఆటగాళ్లకు కలిసొస్తోంది. శుక్రవారం సానియా మీర్జా సిడ్నీ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గగా... మరుసటి రోజే భారత ఆటగాళ్ల ఖాతాలో మరో రెండు డబుల్స్ టైటిల్స్ చేరడం విశేషం. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన హైనికెన్ ఓపెన్‌లో లియాండర్ పేస్ (భారత్) తన భాగస్వామి రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)తో కలిసి చాంపియన్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన సిడ్నీ ఓపెన్‌లో రోహన్ బోపన్న (భారత్) తన భాగస్వామి డానియల్ నెస్టర్ (కెనడా)తో కలిసి విజేతగా అవతరించాడు. మెల్బోర్న్లో యువతార యూకీ బాంబ్రీ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రధాన ‘డ్రా’కు అర్హత సాధించాడు.. డబుల్స్ టైటిల్స్ నెగ్గిన భారత ఆటగాళ్లు ఆక్లాండ్: తన 99వ భాగస్వామితో కలిసి భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తొలి టైటిల్ సాధించాడు. శనివారం ముగిసిన హైనికెన్ ఓపెన్‌లో పేస్-క్లాసెన్ ద్వయం 7-6 (7/1), 6-4తో డొమినిక్ ఇంగ్లోట్ (బ్రిటన్) -ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటను ఓడించింది. కెరీర్లో 93వ డబుల్స్ ఫైనల్ ఆడిన 41 ఏళ్ల పేస్‌కిది 55వ టైటిల్ కావడం విశేషం. 1997 నుంచి ప్రతి ఏడాది పేస్ కనీసం ఒక టైటిలైనా గెలుస్తూ వస్తున్నాడు. విజేతగా నిలిచిన పేస్ జోడీకి 25,670 డాలర్ల (రూ. 15 లక్షల 81 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫైనల్ చేరుకునే క్రమంలో ఆడిన మూడు మ్యాచ్‌లను సూపర్ టైబ్రేక్‌లో నెగ్గిన పేస్ జంట టైటిల్ పోరును మాత్రం వరుస సెట్లలో ముగించింది. సిడ్నీ: తన కొత్త భాగస్వామి డానియల్ నెస్టర్‌తో రోహన్ బోపన్న తొలి టైటిల్‌ను గెల్చుకున్నాడు. శనివారం జరిగిన సిడ్నీ ఓపెన్ ఫైనల్లో బోపన్న-నెస్టర్ (కెనడా) ద్వయం 6-4, 7-6 (7/5)తో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)-హొరియా టెకావ్ (రుమేనియా) జంటపై గెలిచింది. 86 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. గతవారం బ్రిస్బేన్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిన ఈ జంట సిడ్నీలో మాత్రం విజేతగా నిలిచింది. టైటిల్ నెగ్గిన బోపన్న జోడీకి 24,280 డాలర్ల (రూ. 14 లక్షల 95 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 34 ఏళ్ల బోపన్నకు కెరీర్లో ఇది 11వ డబుల్స్ టైటిల్. 42 ఏళ్ల నెస్టర్కిది 86వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. గత 22 ఏళ్ల నుంచి నెస్టర్ ప్రతి ఏడాది కనీసం ఒక టైటిలైనా గెలుస్తున్నాడు. మైక్ బ్రయాన్ (105), బాబ్ బ్రయాన్ (103) తర్వాత ఏటీపీ సర్యూట్‌లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన మూడో డబుల్స్ ప్లేయర్‌గా నెస్టర్ నిలిచాడు.