ఆక్లాండ్‌లో పేస్... సిడ్నీలో బోపన్న
కొత్త ఏడాది భారత టెన్నిస్ ఆటగాళ్లకు కలిసొస్తోంది. శుక్రవారం సానియా మీర్జా సిడ్నీ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గగా... మరుసటి రోజే భారత ఆటగాళ్ల ఖాతాలో మరో రెండు డబుల్స్ టైటిల్స్ చేరడం విశేషం. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన హైనికెన్ ఓపెన్‌లో లియాండర్ పేస్ (భారత్) తన భాగస్వామి రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)తో కలిసి చాంపియన్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన సిడ్నీ ఓపెన్‌లో రోహన్ బోపన్న (భారత్) తన భాగస్వామి డానియల్ నెస్టర్ (కెనడా)తో కలిసి విజేతగా అవతరించాడు. మెల్‌బోర్న్‌లో యువతార యూకీ బాంబ్రీ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్‌లో నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రధాన ‘డ్రా’కు అర్హత సాధించాడు..
డబుల్స్ టైటిల్స్ నెగ్గిన భారత ఆటగాళ్లు
ఆక్లాండ్: తన 99వ భాగస్వామితో కలిసి భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తొలి టైటిల్ సాధించాడు. శనివారం ముగిసిన హైనికెన్ ఓపెన్‌లో పేస్-క్లాసెన్ ద్వయం 7-6 (7/1), 6-4తో డొమినిక్ ఇంగ్లోట్ (బ్రిటన్) -ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటను ఓడించింది. కెరీర్‌లో 93వ డబుల్స్ ఫైనల్ ఆడిన 41 ఏళ్ల పేస్‌కిది 55వ టైటిల్ కావడం విశేషం. 1997 నుంచి ప్రతి ఏడాది పేస్ కనీసం ఒక టైటిలైనా గెలుస్తూ వస్తున్నాడు. విజేతగా నిలిచిన పేస్ జోడీకి 25,670 డాలర్ల (రూ. 15 లక్షల 81 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫైనల్ చేరుకునే క్రమంలో ఆడిన మూడు మ్యాచ్‌లను సూపర్ టైబ్రేక్‌లో నెగ్గిన పేస్ జంట టైటిల్ పోరును మాత్రం వరుస సెట్‌లలో ముగించింది.
సిడ్నీ: తన కొత్త భాగస్వామి డానియల్ నెస్టర్‌తో రోహన్ బోపన్న తొలి టైటిల్‌ను గెల్చుకున్నాడు. శనివారం జరిగిన సిడ్నీ ఓపెన్ ఫైనల్లో బోపన్న-నెస్టర్ (కెనడా) ద్వయం 6-4, 7-6 (7/5)తో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)-హొరియా టెకావ్ (రుమేనియా) జంటపై గెలిచింది. 86 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది.
గతవారం బ్రిస్బేన్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిన ఈ జంట సిడ్నీలో మాత్రం విజేతగా నిలిచింది. టైటిల్ నెగ్గిన బోపన్న జోడీకి 24,280 డాలర్ల (రూ. 14 లక్షల 95 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 34 ఏళ్ల బోపన్నకు కెరీర్‌లో ఇది 11వ డబుల్స్ టైటిల్. 42 ఏళ్ల నెస్టర్‌కిది 86వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. గత 22 ఏళ్ల నుంచి నెస్టర్ ప్రతి ఏడాది కనీసం ఒక టైటిలైనా గెలుస్తున్నాడు. మైక్ బ్రయాన్ (105), బాబ్ బ్రయాన్ (103) తర్వాత ఏటీపీ సర్యూట్‌లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన మూడో డబుల్స్ ప్లేయర్‌గా నెస్టర్ నిలిచాడు.