మళ్లీ కలిసి బరిలోకి...
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ఆటగాడు, డబుల్స్ స్పెషలిస్ట్ రోహన్ బోపన్న తన మాజీ భాగస్వామి ఐసాముల్ హక్ ఖురేషీ (పాకిస్థాన్)తో మళ్లీ జత కట్టనున్నాడు. 2014 సీజన్ నుంచి డబుల్స్‌లో వీరిద్దరు కలిసి బరిలోకి దిగుతారు. 2011 వరకు నాలుగేళ్ల పాటు జంటగా ఆడిన ఈ భారత్-పాక్ ద్వయం గతంలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. ఈ జోడి 2010 యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ కూడా చేరింది. అయితే 2012 లండన్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ఖురేషీతో విడిపోయి మహేశ్ భూపతితో బోపన్న కొన్ని టోర్నీలు ఆడాడు. ఆ తర్వాతి నుంచి వీరిద్దరు వేర్వేరు భాగస్వాములతోనే కలిసి ఆడుతున్నారు.
బోపన్న ప్రస్తుతం ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్నాడు. ‘కోర్టులో, కోర్టు బయట కూడా నాకు, ఐసామ్‌కు మధ్య మంచి సమన్వయం ఉంది. పాత మిత్రుడితో మళ్లీ జత కట్టడం సంతోషంగా అనిపిస్తోంది’ అని బోపన్న వ్యాఖ్యానించాడు. భారత్, పాక్ మధ్య వైరం ఉన్నా...‘స్టాప్ వార్...స్టార్ట్ టెన్నిస్ క్యాంపెయిన్’ అంటూ క్రీడా స్ఫూర్తి చాటిన బోపన్న, ఖురేషీ జంటకు ఆర్థర్ యాష్ హ్యుమనిటేరియన్ అవార్డు, చాంపియన్స్ ఫర్ పీస్ అవార్డు కూడా దక్కడం విశేషం.