అమిత్, గీతలపైనే ఆశలు
బుడాపెస్ట్ (హంగేరి): ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ను కొనసాగించాలనే నిర్ణయం వచ్చాక నూతనోత్సాహంతో 22 మంది సభ్యులుగల భారత బృందం ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగనుంది. సోమవారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్ వారం రోజులపాటు జరుగుతుంది. 16 నుంచి 18 వరకు ఫ్రీస్టయిల్ విభాగంలో; 18 నుంచి 20 వరకు మహిళల విభాగంలో; 20 నుంచి 22 వరకు గ్రీకో రోమన్ విభాగంలో బౌట్‌లు ఉంటాయి. గత ఏడాది లండన్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత రెజ్లర్లు అలాంటి ఫలితాన్నే ఇక్కడా పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉన్నారు. బరిలో 22 మంది రెజ్లర్లు ఉన్నా భారత ఆశలన్నీ ఇద్దరిపైనే ఉన్నాయి. పురుషుల విభాగంలో డిఫెండింగ్ ఆసియా చాంపియన్ అమిత్ కుమార్ (55 కేజీలు)... మహిళల విభాగంలో గీత పోగట్ (59 కేజీలు) పతకాలు నెగ్గే అవకాశాలున్నాయి. గత ఏడాది కెనడాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గీత కాంస్య పతకాన్ని గెలిచింది.
లండన్ ఒలింపిక్స్‌లో రజత, కాంస్య పతకాలు సాధించిన స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ గాయాల కారణంగా ఈ పోటీల్లో పాల్గొన డంలేదు. సోమవారం తొలి రోజున పురుషుల ఫ్రీస్టయిల్ కేటగేరిలో 55 కేజీలు, 66 కేజీలు, 96 కేజీల విభాగాల్లో ప్రిలిమినరీ రౌండ్స్‌తోపాటు ఫైనల్స్ ఉంటాయి. తొలి రౌండ్‌లో యాసుహిరో (జపాన్)తో అమిత్; 66 కేజీల తొలి రౌండ్‌లో రోషన్ (శ్రీలంక)తో అరుణ్ కుమార్; 96 కేజీల తొలి రౌండ్‌లో గామిని (శ్రీలంక)తో సత్యవర్‌త పోటీపడతారు. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు స్వర్ణం, రజతంతోపాటు ఐదు కాంస్య పతకాలు సాధించింది. రష్యాలో జరిగిన 2010 ఈవెంట్‌లో సుశీల్ కుమార్ భారత్‌కు ఏకైక స్వర్ణ పతకాన్ని అందించాడు.