అమిత్ కుమార్‌కు రజతం
అంతర్జాతీయ రెజ్లింగ్ యవనికపై మరో భారత రెజ్లర్ మెరిశాడు. లండన్ ఒలింపిక్స్‌లో సహచరులు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ మెరిస్తే... వారితో కలిసి సాధన చేసే యువ రెజ్లర్ అమిత్ కుమార్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటాడు. సోమవారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో ఈ హర్యానా రెజ్లర్ ఫ్రీస్టయిల్ 55 కేజీల విభాగంలో భారత్‌కు రజత పతకాన్ని అందించాడు.
బుడాపెస్ట్ (హంగేరి): అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత యువ రెజ్లర్ అమిత్ కుమార్ ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 55 కేజీల విభాగంలో 20 ఏళ్ల అమిత్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో ఈ ఆసియా చాంపియన్ అమిత్ 1-2 పాయింట్ల తేడాతో హసన్ ఫర్మాన్ రహీమి (ఇరాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. తొలి రోజున భారత్ నుంచి ముగ్గురు రెజ్లర్లు బరిలోకి దిగగా... అమిత్‌కు పతకం లభించింది.
ఇతర రెజ్లర్లు అరుణ్ కుమార్ (66 కేజీలు), సత్యవర్త్ (96 కేజీలు) నిరాశపరిచారు. అరుణ్ తొలి రౌండ్‌లో ఓడిపోగా... సత్యవర్త్ రెండో రౌండ్‌లో పరాజయం పాలయ్యాడు.
మొత్తం 34 మంది రెజ్లర్లు పాల్గొన్న 55 కేజీల విభాగంలో అమిత్ ఫైనల్ మినహా మిగతా అన్ని రౌండ్స్‌లో ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. తొలి రౌండ్‌లో ఈ హర్యానా రెజ్లర్ 10-2తో యాసుహిరో ఇనాబా (జపాన్)పై గెలుపొందగా... రెండో రౌండ్‌లో 8-0తో జోహైర్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్లో అమిత్ 6-0తో ఎంజెల్ ఎస్కొబెడో (అమెరికా)ను చిత్తు చేయగా... సెమీఫైనల్లో 8-0తో సెజార్ అక్‌గుల్ (టర్కీ)ను ఓడించి ఫైనల్ పోరుకు అర్హత సాధించాడు.
1967 తర్వాత...
తాజా ప్రదర్శనతో అమిత్ ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన ఎనిమిదో భారత రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. 1967లో బిషంబర్ సింగ్ (57 కేజీలు) తర్వాత ఈ మెగా ఈవెంట్‌లో రజత పతకం సాధించిన తొలి రెజ్లర్‌గా అమిత్ నిలిచాడు. 2010 ఈవెంట్‌లో సుశీల్ కుమార్ (66 కేజీలు) స్వర్ణ పతకం సంపాదించగా... 2009 ఈవెంట్‌లో రమేశ్ కుమార్ (74 కేజీలు), 1961 ఈవెంట్‌లో ఉదయ్ చంద్ (67 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. మహిళల విభాగంలో 2012 ఈవెంట్‌లో గీత (55 కేజీలు), బబిత (51 కేజీలు), 2006 ఈవెంట్‌లో అల్కా తోమర్ (59 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు.