‘టాప్’ కమిటీలో గోపీచంద్
న్యూఢిల్లీ: భారత దేశ జనాభా వంద కోట్లకు పైగా చేరుకున్నా క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యత అంతంతమాత్రమే. ఒలింపిక్స్‌లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలకు వెళితే పట్టుమని పది పతకాలు కూడా సాధించలేని పరిస్థితి. క్రితం సారి లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు వచ్చిన పతకాల సంఖ్య కేవలం ఆరు.
తాజాగా ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 2016, 2020 ఒలింపిక్స్‌ల్లో పతకాల సంఖ్య పెంచేందుకు మెరికల్లాంటి ఆటగాళ్లను తయారుచేయాలనే ఉద్దేశంతో క్రీడా శాఖ కొత్తగా ‘టార్గెట్ మిషన్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్)’ అనే పథకాన్ని ప్రవేశపెట్టనుంది. దీన్ని జాతీయ క్రీడా అభివృద్ధి నిధి ద్వారా ప్రమోట్ చేస్తారు. దీంట్లో భాగంగా దేశంలోని నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. దీంట్లో క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, ప్రముఖ షూటర్ అభినవ్ బింద్రా, జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పి.గోపీచంద్‌లతో పాటు సాయ్ డెరైక్టర్ జనరల్, మిట్టల్ చాంపియన్స్ ట్రస్ట్ సీఈవో మనీష్ మల్హోత్రా, కన్వీనర్‌గా అమ్రిత్ మాథుర్ ఉండనున్నారు. వీరికి బీజేపీ ఎంపీ, భారత ఒలింపిక్ సంఘం ఎగ్జిక్యూటివ్ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ నేతృత్వం వహిస్తారు.
2016లో క్రితంసారి కన్నా రెట్టింపు, 2020లో టోక్యో ఒలింపిక్స్‌లో 20 పతకాలను సాధించే లక్ష్యంతో 75 నుంచి 100 మంది వరకు అథ్లెట్లను గుర్తించి వారికి అత్యంత ఆధునిక శిక్షణను ఇవ్వనున్నారు. ముఖ్యంగా అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, రెజ్లింగ్, షూటింగ్ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మేజర్ టోర్నీల్లో ఈ విభాగాల నుంచే భారత్ అత్యధిక పతకాలు దక్కించుకుంటోంది.