
డబ్ల్యూఎఫ్‌ఐపై సస్పెన్షన్ ఎత్తివేత
15 నెలల తర్వాత క్రీడా శాఖ నిర్ణయం
న్యూఢిల్లీ: భారత రెజ్లర్లకు మేలు చేసే కీలక నిర్ణయాన్ని కేంద్ర క్రీడాశాఖ తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)పై విధించిన సస్పెన్షన్‌ను క్రీడా శాఖ ఎత్తేసింది. డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై స్టార్ రెజ్లర్ల లైంగిక ఆరోపణలు దరిమిలా చుట్టుముట్టిన వివాదాలు, కోర్టు కేసుల అనంతరం 15 నెలల క్రితం కొత్త కార్యవర్గం కొలువు దీరింది. కానీ రోజుల వ్యవధిలోనే కేంద్ర క్రీడా శాఖ ఆగ్రహానికి గురైంది. దీంతో పలు అంతర్జాతీయ ఈవెంట్లలో భారత రెజ్లర్లు పాల్గొనేందుకు ఇబ్బందులెదురవుతున్నాయి.
రెజ్లర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు నిషేధాన్ని ఎత్తేసింది. కేంద్ర క్రీడా శాఖ మార్గదర్శకాలను డబ్ల్యూఎఫ్‌ఐ పాటించడంతో పాటు రెజ్లర్ల విస్తృత ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. క్రీడాపాలసీ ప్రకారం డబ్ల్యూఎఫ్‌ఐ నడచుకోవాలని, వివాదాస్పద, కళంకిత అధికారులు, పాత కార్యవర్గ సభ్యులకు దూరంగా ఉండాలని, లేదంటే కఠిన చర్యలకు వెనుకాడమని క్రీడా శాఖ హెచ్చరించినట్లు తెలిసింది.
డబ్ల్యూఎఫ్‌ఐ కార్యకలాపాలు మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ ఇంటినుంచే నిర్వహిస్తున్నారనే విమర్శలపై క్రీడాశాఖ పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రత్యక్ష పరిశీలన అనంతరం ఇచి్చన నివేదికను బట్టే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో వచ్చే ఏషియాడ్ (2026), లాస్ ఏంజెలెస్ (2028) ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనుకునే రెజ్లర్లకు కొండంత ఆత్మవిశ్వాసం లభించినట్లయ్యింది. క్రీడాశాఖ నిర్ణయంపై డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.
‘ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సస్పెన్షన్ తొలగిపోవడంతో ఇక మా కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు అవకాశం లభించింది. రెజ్లింగ్ క్రీడ అభ్యున్నతికి ఇలాంటి నిర్ణయం ఎంతో అవసరం కూడా! ఇప్పటికే ప్రతిభావంతులైన రెజ్లర్లు పలు అంతర్జాతీయ ఈవెంట్లకు దూరమయ్యారు. ఇకనుంచి వారంతా పతకాల కోసం పోటీపడొచ్చు’ అని అన్నారు. క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ సస్పెన్షన్‌ను ఇంకా కొనసాగిస్తే రెజ్లర్లకు అన్యాయం చేసిన వారమవుతామని చెప్పారు.
రెజ్లర్లు అంతర్జాతీయ క్రీడావేదికలపై రాణించాలనే సదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ మాట్లాడుతూ తనపై చేసిన తప్పుడు ఆరోపణలేవీ నిలబడలేదని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment