నాలుగు స్వర్ణాలు గెలిచిన భారత అమ్మాయిలు
అదితి, నేహా, పుల్కిత్, మాన్సీలకు పసిడి పతకాలు
అమ్మాన్ (జోర్డాన్): సీనియర్ స్థాయిలోనే కాకుండా జూనియర్ స్థాయిలోనూ అంతర్జాతీయ వేదికపై భారత రెజ్లర్లు తమ పట్టు నిరూపించుకుంటున్నారు. ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు లభించాయి.
గురువారం జరిగిన నాలుగు ఫైనల్స్‌లో బరిలోకి దిగిన భారత అమ్మాయిలు ఎదురులేని విజయాలు సాధించి బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. అదితి కుమారి (43 కేజీలు), నేహా (57 కేజీలు), పుల్కిత్ (65 కేజీలు), మాన్సీ లాథెర్ (73 కేజీలు) ప్రపంచ చాంపియన్‌లుగా అవతరించారు. శుక్రవారం భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణ పతకాలు చేరే అవకాశముంది.
కాజల్ (69 కేజీలు), శ్రుతిక శివాజీ పాటిల్ (46 కేజీలు) నేడు జరిగే ఫైనల్లో స్వర్ణ–రజత పతకాల కోసం పోటీపడతారు. రాజ్‌బాలా (40 కేజీలు), ముస్కాన్ (53 కేజీలు), రజీ్నత (61 కేజీలు) కాంస్య పతకాల రేసులో ఉన్నారు. 49 కేజీల విభాగంలో భారత్ నుంచి ఎవరూ బరిలోకి దిగలేదు. ఓవరాల్‌గా భారత అమ్మాయిల జట్టకు టీమ్ ట్రోఫీ టైటిల్ లభించే అవకాశం కూడా ఉంది.
43 కేజీల ఫైనల్లో అదితి 7–0తో మరియా లుజా జికికా (గ్రీస్)పై గెలుపొందగా... 57 కేజీల ఫైనల్లో నేహా ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో 10–0తో జపాన్ రెజ్లర్ సో సుత్సుయ్‌ను చిత్తు చేయడం విశేషం. 3 నిమిషాల 59 సెకన్లలో నేహా జపాన్ రెజ్లర్‌పై పది పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది.
నిబంధనల ప్రకారం ప్రత్యర్థిపై పది పాయింట్ల ఆధిక్యం సాధించిన వెంటనే ఆ రెజ్లర్‌ను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. 65 కేజీల ఫైనల్లో పుల్కిత్ 6–3తో అంతర్జాతీయ తటస్థ రెజ్లర్ దరియా ఫ్రోలోవాపై నెగ్గింది. 73 కేజీల ఫైనల్లో మాన్సీ 5–0తో అంతర్జాతీయ తటస్థ రెజ్లర్ హనా పిర్స్‌కాయాపై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment