7సంస్థలు.. రూ. 34,000 కోట్లు | Govt plans to raise Rs 34,000 cr via stake sale in 7 PSUs | Sakshi
Sakshi News home page

7సంస్థలు.. రూ. 34,000 కోట్లు

Published Tue, Apr 18 2017 12:55 AM | Last Updated on Fri, Nov 9 2018 5:37 PM

7సంస్థలు.. రూ. 34,000 కోట్లు - Sakshi

7సంస్థలు.. రూ. 34,000 కోట్లు

ఐవోసీ, సెయిల్‌ తదితర సంస్థల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌!∙∙  
మర్చంట్‌ బ్యాంకర్ల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం  


న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన ఏడు దిగ్గజ సంస్థల్లో వాటాల విక్రయానికి కసరత్తు మొదలైంది. ఇందుకు సంబంధించి మర్చంట్‌ బ్యాంకర్లు, లీగల్‌ అడ్వైజర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) వెల్లడించింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌), నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) తదితర బ్లూచిప్‌ సంస్థల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.34,000 కోట్లు రావొచ్చని అంచనా.

 డిజిన్వెస్ట్‌మెంట్‌ జాబితాలో నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ), రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ), ఎన్‌ఎల్‌సీ ఇండియా కూడా ఉన్నాయి. వాటాల విక్రయానికి నిర్దిష్ట గడువేదీ పెట్టుకోలేదని, రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ జారీ .. మర్చంట్‌ బ్యాంకర్ల ఎంపిక కోసం మాత్రమే నిర్ణయం తీసుకున్నామని దీపం కార్యదర్శి నీరజ్‌ గుప్తా చెప్పారు. ‘ఇది డిజిన్వెస్ట్‌మెంట్‌ సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రక్రియలో భాగం మాత్రమే.

 కచ్చితంగా ఈ పీఎస్‌యూల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌ జరుగుతుందనేమీ లేదు‘ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇప్పటికే 12 పీఎస్‌యూల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌కు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో కొత్తగా ప్రతిపాదించిన సంస్థల్లో వాటాల విక్రయ అంశం ముందుకు కదలడానికి మరికాస్త సమయం పట్టొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2017–18 బడ్జెట్‌ ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 46,500 కోట్లు, వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా రూ. 15,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. 2016–17లో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ. 46,247 కోట్లు సమీకరించింది.

ఎన్‌టీపీసీ, పీఎఫ్‌సీల్లో 10 శాతం వాటాలు
రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ ప్రకారం... కేంద్రం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో 3 శాతం, సెయిల్‌.. ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, పీఎఫ్‌సీల్లో 10 శాతం చొప్పున వాటాలు విక్రయించాలని భావిస్తోంది. అలాగే ఎన్‌ఎల్‌సీ ఇండియా (గతంలో నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌)లో 15 శాతం, ఆర్‌ఈసీలో 5 శాతం మేర డిజిన్వెస్ట్‌మెంట్‌ యోచన ఉంది. ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం చూస్తే.. ఈ డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 34,000 కోట్లు దఖలు పడే అవకాశం ఉంది.

 ఇందులో ఎన్‌టీపీసీ నుంచి రూ. 13,000 కోట్లు, ఐవోసీ నుంచి రూ. 6,000 కోట్లు, సెయిల్‌ నుంచి రూ. 2,500 కోట్లు రావొచ్చు. అలాగే పీఎఫ్‌సీలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 4,000 కోట్లు, ఎన్‌హెచ్‌పీసీ నుంచి రూ. 3,000 కోట్లు, ఎన్‌ఎల్‌సీ (రూ. 2,000 కోట్లు), ఆర్‌ఈసీ (రూ. 1,000 కోట్లు) రావొచ్చని అంచనా. కేంద్రానికి ఐవోసీలో 58.28%, ఎన్‌టీపీసీలో 69.74%, సెయిల్‌లో 75%, ఎన్‌హెచ్‌పీసీలో 74.50%, ఎన్‌ఎల్‌సీ ఇండియాలో 90%, పీఎఫ్‌సీలో 67.80%, ఆర్‌ఈసీ 60.64% వాటాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement