
లండన్ : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని టీపీసీసీ ఎన్నారై సెల్ కోరింది. తెలంగాణ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని టీపీసీసీ ఎన్నారై సెల్ లండన్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ తిరుపతి రెడ్డి, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్(ఐఓసీ) కార్యదర్శి వీరేంద్ర, ఐఓసీ నేతలు గురమిందర్, రష్పాల్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌కి ఓట్లు వేయడం వల్ల తెలంగాణకి ఒరిగేది ఏమీలేదని, ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో చేరిన వారందరిని కలిపితే 15 ఎంపీలున్నా ఏం సాధించారని ప్రశ్నించారు. ఒక్క విభజన హామీని టీఆర్‌ఎస్ నెరవేర్చలేదని మండిపడ్డారు. 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించి తెలంగాణ ఇచ్చిన, తెచ్చిన కాంగ్రెస్‌కి అండగా నిలవాలని కోరారు. ఐఓసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ కో కన్వీనర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ సచివాలయం రాకుండా ఇంట్లోనే ఉంటూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 17 సీట్లలో కాంగ్రెస్‌ని గెలిపించి కేసీఆర్ సచివాయం ఎలా రారో చూద్దామన్నారు.
టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్, యూకే, ఐఓసీ ప్రధాన కార్యదర్శి గంప వేణుగోపాల్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌లో మొదటి నుండి ఉండి, అహర్నిశలు పని చేసిన హరీష్ రావు గొంతు కోయడమే కేసీఆర్ ధోరణిగా తెలుస్తుందని నిప్పులు చెరిగారు. మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలు వేటినీ ప్రజలు నమ్మరని అన్నారు. కేసీఆర్ హరీష్ రావుకి ద్రోహం చేశారా? హరీష్ రావు కేసీఆర్‌కి ద్రోహం చేశారా? తెలపాలని డిమాండ్ చేశారు. అడ్వైజరీ మెంబర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ గత100రోజుల్లో ఏ పని మొదలు పెట్టలేదని, ఎంత సేపు తన కొడుకు చుట్టూ రాజకీయాలు తింపుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే ప్రజాస్వామ్యానికి ఓటు వేసినట్లు అని అన్నారు.
కో కన్వీనర్ రాకేష్ బిక్కుమండ్ల మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకి కృషి చేసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధులని గెలిపించు కోవాలని, కాంగ్రెస్ అధికారం లక్ష్యంగా పని చేయాలనీ కోరారు. కో కన్వీనర్ శ్రీధర్ మంగళారపు మాట్లాడుతూ... ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మద్యేనని టీఆర్‌ఎస్‌కి ప్రాంతీయ పార్టీలకు ఓటు వేయడం వృధా అన్నారు. కార్యదర్శి , శ్రీధర్ నీలా మాట్లాడుతూ.. ఎన్నికల్లో బ్రిటన్ ఎన్నారైలు క్రియాశీలకంగా పని చేస్తున్నారని వరంగల్ వాసినైన తాను వరంగల్, మహబూబాబాద్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కృషి చేస్తానని అన్నారు. మహిళా విభాగం- ప్రధాన కార్యదర్శి మేరీ మాట్లాడుతూ.. స్వతంత్ర ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమం వరకు కాంగ్రెస్ శ్రమ ఎంతో ఉందని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే దళిత, మైనారిటీ మహిళలకి రక్షణ ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ విభాగం కార్యవర్గ సభ్యులు దేవులపల్లి శ్రీనివాస్, నీల శ్రీధర్, మేరీ, రజిత, శశి, అఖిల్, వేణుగోపాల్, సుభాష్, తిరుపతి రెడ్డి, గంప వేణుగోపాల్, సుధాకర్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, రాకేష్, శ్రీధర్ మంగళారపు, స్నేహలత, వైష్ణవి, రంజిత్, ప్రకాష్‌ల ఆధ్వర్యంలో విజయవంతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment