బెంగళూరు: చమురు రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాడి పడేసిన పెట్ బాటిళ్లను ఏటా రీసైకిల్ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా పర్యావరణ అనుకూల వస్త్రాలను తయారు చేస్తారు. ఇందుకు ప్రతి సంవత్సరం 10 కోట్ల బాటిళ్లను రీసైకిల్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. పెట్రోల్ పంపులు, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీల సిబ్బందికి ఈ వస్త్రంతో అన్‌బాటిల్డ్ పేరుతో యూనిఫాం తయారు చేస్తారు.
సౌర శక్తితో సైతం పనిచేసే వంటింటి స్టవ్‌లను ఐవోసీ రూపొందించింది. సూర్యుడు లేని సమయంలో ఎల్‌పీజీ, పైప్డ్ గ్యాస్‌తో స్టవ్ పనిచేస్తుంది. అన్‌బాటిల్డ్ యూనిఫాం, స్టవ్‌ను ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సమీప భవిష్యత్తులో 3 కోట్ల గృహాలకు ఈ స్టవ్‌లు చేరతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్‌బాటిల్డ్ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్దది అని చమురు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ తెలిపారు. చమురు విక్రయ కంపెనీల్లో ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఇతర సంస్థలు, రిటైల్ విక్రయాల కోసం యూనిఫాంలు తయారు చేస్తామన్నారు. యుద్ధానికి కాకుండా ఇతర సమయాల్లో వేసుకునేలా సాయుధ దళాల కోసం దుస్తులు సైతం రూపొందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment