(ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: చమురు కంపెనీలు గ్యాస్ వినియోగదారులకు హోలీ కానుక అందించాయి. ఎల్‌పీజీ లేదా వంట గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించాయి. సబ్సిడీ, నాన్ సబ్సిడీ, కమర్షియల్ సిలిండర్ల ధరపై తగ్గింపును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సవరించిన రేట్లు మార్చి 1నుంచి అమల్లోకి వచ్చాయి. ఈమేరకు ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్ సైట్ లో గ్యాస్ సిలిండర్ ధరలు పట్టిక కూడా వెల్లడించింది. నాలుగు మెట్రో నగరాలు ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబై తగ్గిన సిలిండర్ల ధరలు ఇలా ఉండనున్నాయి.
నాన్ సబ్సిడీ డొమెస్టిక్ సిలిండర్ రూ. 47 ధర తగ్గింపు
ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం, 14.2 కిలోల సబ్సిడీ లేని సిలిండర్ ధరలు తగ్గాయి. ఒక్కో సిలిండర్ రూ.45.50 నుండి 47 రూపాయలకు తగ్గింది. ఢిల్లీలో సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ల ధర రూ.47 తగ్గి రూ. 689కి దిగివచ్చింది. కోలకతాలో రూ.45.50 తగ్గి రూ.711.50కు గా ఉండనుంది. ముంబైలో రూ.47 తగ్గి రూ.661కు చేరుకుంది. చెన్నైలో రూ. 46.50 తగ్గింపు అనంతరం ప్రస్తుతధర రూ. 699.50కుగా ఉంటుంది.
సబ్సిడీ సిలిండర్ల ధర
సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల ధరలను ఇండియన్ ఆయిల్ రెండున్నర రూపాయలకు పైగా తగ్గించింది. మార్చి 1 నుంచి సబ్సిడీ సిలిండర్లకు ఢిల్లీలో రూ.493.09 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు రూ.495.63 చెల్లించాల్సి ఉండేది. కోల్కతాలో సిలిండర్ ధర రూ.2.53 తగ్గి రూ.496.60కు, చెన్నైలో సిలిండర్ ధర రూ.2.48 తగ్గి రూ.481.21కు చేరుకుంది.
కమర్షియల్ సిలిండర్ల ధర
19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరలు 77 నుంచి 80 రూపాయలవరకు తగ్గించింది. ఢిల్లీలో 78.50 రూపాయలు తగ్గి రూ.1230 గాను, కోల్‌కతాలో 77 రూపాయలు తగ్గి రూ. 1270.50 , ముంబైలో రూ.79 తగ్గి రూ.1181కు , చెన్నైలో రూ.80 తగ్గి రూ.1307కు గా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment