న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) నిరుత్సాహకర ఫలితాలు వెల్లడించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లోనూ లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. రూ. 272 కోట్లకుపైగా నష్టం ప్రకటించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 6,360 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఉత్పత్తి వ్యయాలకంటే తక్కువ ధరల్లో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ విక్రయాలు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది.
ఏప్రిల్–జూన్(క్యూ1)లోనూ కంపెనీ దాదాపు రూ. 1,993 కోట్ల నికర నష్టం ప్రకటించిన సంగతి తెలిసిందే. వెరసి వరుసగా రెండో క్వార్టర్లలో నష్టాలు నమోదు చేసిన రికార్డు సొంతం చేసుకుంది. కాగా.. ప్రస్తుత క్యూ2లో మొత్తం ఆదాయం మాత్రం రూ. 1.69 లక్షల కోట్ల నుంచి రూ. 2.28 లక్షల కోట్లకు ఎగసింది. కాగా.. ప్రభుత్వం ఈ నెల 12న వన్‌టైమ్ గ్రాంట్‌కింద మూడు పీఎస్‌యూ ఇంధన దిగ్గజాలకు ఉమ్మడిగా రూ. 22,000 కోట్లు కేటాయించింది. వీటిలో ఐవోసీకి రూ. 10,081 కోట్లు లభించాయి. ఈ సబ్సిడీని తాజా త్రైమాసికంలో పరిగణించినప్పటికీ నష్టాలు ప్రకటించడం గమనార్హం!
మార్జిన్లు అప్
క్యూ2లో బ్యారల్‌కు స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 6.57 డాలర్ల నుంచి 25.49 డాలర్లకు ఎగశాయి. ఇన్వెంటరీ ప్రభావాన్ని మినహాయిస్తే 22.19 డాలర్లుగా నమోదయ్యాయి.పెట్రోలియం ప్రొడక్టుల అమ్మకాలు 18.93 మిలియన్ టన్నుల నుంచి 21.56 ఎంటీకి పుంజుకున్నాయి. అయితే ఎగుమతులు 1.24 ఎంటీ నుంచి 0.86 ఎంటీకి తగ్గాయి. ఈ కాలంలో 16.09 ఎంటీ ముడిచమురును శుద్ధి చేసింది. గత క్యూ2లో ఇవి 15.27 ఎంటీ మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment