న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) నామినేటెడ్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. తద్వారా భారత్ నుంచి ఒలింపిక్స్ కమిటీలో సభ్యత్వం పొందిన తొలి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. ఈ మేరకు గురువారం జరిగిన ఎన్నికల్లో నీతా ఎన్నికయ్యారు.
విద్య, క్రీడల్లో ఆమె చేస్తున్న కృషికి గాను నీతా పేరును ఒలింపిక్స్ కమిటీ సభ్యత్వానికి ప్రతిపాదించారు. దీంతో 70 ఏళ్ల వయసు వరకు నీతా ఐఓసీ నామినేటేడ్ మెంబర్ గా కొనసాగనున్నారు. గత జూన్లో ఆమె పేరును ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యత్వానికి భారత్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఓవరాల్ గా భారత్ నుంచి ఒలింపిక్స్ కమిటీలో సభ్యత్వం మూడో వ్యక్తిగా నీతా నిలిచారు. అంతకుముందు సర్ దొరాబ్జి టాటా, రాజా రాంధీర్ లు ఒలింపిక్స్ కమిటీలో సభ్యత్వం పొందిన వారిలో ఉన్నారు.