మరో నలుగురు ఒలింపియన్లపై వేటు
లాసన్నె (స్విట్జర్లాండ్): బీజింగ్ 2008, లండన్ 2012 ఒలింపిక్స్ గేమ్స్లో పాల్గొన్న నలుగురు రష్యా అథ్లెట్లను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) అనర్హులుగా ప్రకటించింది. రష్యా అథ్లెట్లు డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్గా తేలారని, నిషేధిత ఉత్ప్రేరకం డిహైడ్రోక్లోర్మిథైల్టెస్టోస్టెరాన్ వాడినట్టు రుజువుకావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అనర్హులైనవారిలో బీజింగ్ ఒలింపిక్స్లో పాల్గొన్నవారు ముగ్గురు, లండన్ గేమ్స్లో పాల్గొన్న ఓ అథ్లెట్ ఉన్నారు. కాగా వీరి నలుగురిలో ఒక్కరికి మాత్రమే ఒలింపిక్ పతకం వచ్చింది.
బీజింగ్లో జావెలిన్ త్రోలో రజతం సాధించిన మరియా అబకుమోవా, 10 వేల మీటర్ల రేసులో ఆరో స్థానంలో ఉన్న ఇంగా అబిటోవా, 400 మీటర్ల ఈవెంట్లో 23వ స్థానంలో నిలిచిన డెనిస్ అలెక్సీవ్.. లండన్లో సైక్లింగ్ ఈవెంట్లో ఎనిమిదో స్థానంలో నిలిచిన ఎకటరీనా గ్నిడెంకోపై ఐఓసీ వేటువేసింది. బీజింగ్, లండన్ గేమ్స్ సమయంలో వీళ్ల నుంచి సేకరించిన శాంపిల్స్కు పరీక్షలు నిర్వహించారు. డోపింగ్ కేసులో పట్టుబడ్డ కొందరు ఒలింపియన్లను ఇటీవల అనర్హులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.