పెట్రోల్, డీజిల్ ధరలు రోజువారీగా..
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ చమురు సంస్థలకు చెందిన 58 వేల పెట్రోల్ బంకుల్లో జూన్ 16 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ మారనున్నాయి. ధరలను రోజూవారీ సమీక్షించాలని ప్రభుత్వరంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ నిర్ణయించాయి. దీంతో పెట్రోల్ ధరలు రోజూ మారుతూ... ఒకే రోజులో కూడా మూడు కంపెనీల బంకుల్లో మూడు రకాలుగా ఉండనున్నాయి.
ఈ విధానం వల్ల పెట్రో ఉత్పత్తుల ధరల్లో పారదర్శకత ఉంటుందని చమురు సంస్థల అధికారులు తెలిపారు. ప్రస్తుతం పెట్రోల్ ధరలను పక్షం రోజులకోసారి సమీక్షిస్తుండడం తెలిసిందే. ధరలను ఏరోజుకారోజు దినపత్రికల్లో ముద్రిస్తామనీ, అందరికీ కనిపించేలా పెట్రోల్ పంపుల్లోనూ ప్రదర్శించడమేగాక, మొబైల్ యాప్‌లు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా తెలియపరుస్తాని వారు చెప్పారు.