ఐఓసీలో నీతా అంబానీ!
న్యూఢిల్లీ: రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) లో సభ్యత్వం కోసం నామినేట్ అయ్యారు. ఆగస్టు 2 నుంచి 4 వరకు రియో డి జనీరోలో జరిగే ఐఓసీ సెషన్‌లో ఈ ఎన్నిక జరుగుతుంది. ఒకవేళ నీతా ఎన్నికైతే భారత్ నుంచి ఐఓసీలో చోటు దక్కించుకున్న తొలి మహిళగా ఘనత సాధిస్తారు.
ఒకసారి ఎన్నికైతే ఆమెకు 70 ఏళ్ల వయస్సు వచ్చే వరకు సభ్యురాలిగా ఉంటారు. ఐఓసీ సభ్యురాలిగా నామినేట్ అయిన నీతా అంబానీకి బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, షూటర్ అభినవ్ బింద్రా, బాక్సర్ మేరీ కోమ్, టెన్నిస్ స్టార్ పేస్ మద్దతు పలికారు. విద్య, క్రీడా రంగాల్లో ఆమె చేసిన కృషికి ఇది గుర్తింపు అని కొనియాడారు. ‘ఇది భారత్‌కు, దేశ మహిళలకు గర్వకారణం. క్రీడాభివృద్ధికి ఆమె కృషి అభినందనీయం’ అని సచిన్ ట్వీట్ చేశారు.