
అఫ్గానిస్తాన్ శరణార్థి జూడో ప్లేయర్ అసాధారణ ప్రయాణం
పారిస్: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నేతృత్వంలోని శరణార్థి జట్టు తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ప్రతికూల పరిస్థితుల మధ్య పోరాటం, పట్టుదలతో విశ్వ క్రీడలకు వెళ్లాలని ప్రయతి్నంచే వారి ప్రయాణం అసాధారణం. ఇలాంటి వారిలో అఫ్గానిస్తాన్‌కు చెందిన సిబ్గతుల్లా అరబ్ ఒకడు. ఈ ఒలింపిక్స్‌లో అతను జూడో (81 కేజీల విభాగం)లో బరిలోకి దిగాడు. 2021లో అఫ్గానిస్తాన్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోయాక అక్కడి పరిస్థితులు మారిపోవడంతో అరబ్ ఆ దేశం నుంచి పారిపోయాడు.
అప్పటికి 19 ఏళ్ల వయసులో ఉన్న అతను అఫ్గాన్ జాతీయ జూడో జట్టులోకి ఎంపికయ్యాడు కూడా. అక్కడి నుంచి బయల్దేరి తొమ్మిది నెలల పాటు ఎన్నో కష్టాలకు ఓర్చి ఇరాన్, టర్కీ, గ్రీస్, బోస్నియా అండ్ స్లొవేనియాలలో తలదాచుకుంటూ చివరకు జర్మనీ చేరాడు. డార్ట్‌మండ్ సమీపంలోని శరణార్ధి శిబిరంలో తనలాగే ఇరాన్ నుంచి వచి్చన కోచ్ ఆధ్వర్యంలో జూడోలో శిక్షణ కొనసాగించాడు.
అక్కడే ఆటలో రాటుదేలిన అరబ్... యూరోపియన్ ఓపెన్ తదితర టోరీ్నల్లో రాణించి ఎట్టకేలకు ఐఓసీ శరణార్ధి టీమ్‌లోకి ఎంపికయ్యాడు. ఇప్పటికీ అరబ్ కుటుంబం అఫ్గానిస్తాన్‌లో ఉంటోంది. తన తల్లి, సోదరుడితో మాట్లాడుతుంటానని... భవిష్యత్తులో తన పరిస్థితి మెరుగవుతుందని అరబ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.