న్యూఢిల్లీ: వడ్డీ కాసులవాడైన తిరుపతి గోవిందుడి సంపద .. ఇంతింతై .. అన్నట్లుగా ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో వ్యాపార దిగ్గజ కంపెనీలను కూడా వెనక్కు నెట్టేస్తోంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించిన గణాంకాలను బట్టి చూస్తే ఈ విషయంలో ఐటీ సేవల దిగ్గజం విప్రో, ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఓఎన్‌జీసీ, ఐవోసీ మొదలైనవి కూడా వెంకన్న ముందు దిగదుడుపే.
టీటీడీ గణాంకాల ప్రకారం ఆయన సంపద విలువ రూ. 2.5 లక్షల కోట్లు. వీటిలో 10.25 టన్నుల బంగారం డిపాజిట్లు, 2.5 టన్నుల బంగారు ఆభరణాలు, రూ. 16,000 కోట్ల డిపాజిట్లు, దేశవ్యాప్తంగా 960 ప్రాపర్టీలు ఉన్నాయి. తిరుమల బాలాజీ సంపద నికర విలువ .. పలు దేశీ బ్లూ చిప్ కంపెనీల వేల్యుయేషన్ (ప్రస్తుత ట్రేడింగ్ ధరల ప్రకారం) కన్నా అధికం. స్టాక్ ఎక్ఛేంజీలో శుక్రవారం నాటి ముగింపు డేటా బట్టి చూస్తే విప్రో మార్కెట్ క్యాప్ రూ. 2.14 లక్షల కోట్లు కాగా అల్ట్రాటెక్ సిమెంట్‌ది రూ. 1.99 లక్షల కోట్లుగా ఉంది.
స్విస్ బహుళజాతి దిగ్గజం నెస్లే భారత విభాగం మార్కెట్ విలువ రూ. 1.96 లక్షల కోట్లు. అటు ప్రభుత్వ రంగంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) విలువ కూడా బాలాజీ ట్రస్టు సంపద కన్నా తక్కువే. రెండు డజన్ల కంపెనీలకు మాత్రమే ఇంతకు మించిన మార్కెట్ వేల్యుయేషన్ ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ (రూ. 17.53 లక్షల కోట్లు), టీసీఎస్ (రూ. 11.76 లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (రూ. 8.34 లక్షల కోట్లు), ఐటీసీ (రూ. 4.38 లక్షల కోట్లు) మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,100 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం బ్యాంకుల్లోని నగదు డిపాజిట్లపై రూ. 668 కోట్లు, హుండీ ఆదాయం రూ. 1,000 కోట్ల వరకూ ఉంటుందని టీటీడీ అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment