
న్యూఢిల్లీ: తెలంగాణలోని జగిత్యాలలో సీఎన్‌జీ సరఫరా లైసెన్స్ ఐఓసీకి దక్కింది. జగిత్యాలతో పాటు ఔరంగాబాద్(బిహర్), రేవా (మధ్య ప్రదేశ్)ల్లో ఈ కంపెనీ వాహనాలకు సీఎన్‌జీని, గృహాలకు పైపుల ద్వారా సీఎన్‌జీని సరఫరా చేసే హక్కులను పొందింది. పెట్రోలియమ్ అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్...48 నగరాల్లో సీఎన్‌జీ గ్యాస్ సరఫరా బిడ్‌ల వివరాలను వెల్లడించింది. అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ గ్యాస్‌కు 11 నగరాల్లో సీఎన్‌జీ సరఫరా లైసెన్స్‌లు లభించాయి.
అలహాబాద్ సహా మొత్తం 11 నగరాల్లో సీఎన్‌జీని సరఫరా చేసే హక్కులను అదానీ గ్రూప్ సాధించింది. దీంట్లో ఆరు నగరాల్లో సొంతంగానూ, ఇతర నగరాల్లో ఐఓసీతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్‌తో అదానీ సీఎన్‌జీని సరఫరా చేస్తుంది. బీపీసీఎల్‌కు చెందిన భారత్ గ్యాస్ రీసోర్సెస్ సంస్థకు ఆరు నగరాల్లో లైసెన్స్‌లు లభించాయి. టొరంట్ గ్యాస్ కంపెనీకి కూడా ఆరు నగరాల్లో గ్యాస్ సరఫరా చేయడానికి లైసెన్స్‌లు వచ్చాయి. గెయిల్‌కు చెందిన గెయిల్ గ్యాస్ మూడు నగరాల్లో గ్యాస్ రిటైలింగ్ లైసెన్స్‌లు పొందింది.