ఇండియన్ మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా CNG కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే సాధారణ పెట్రోల్ కారు కంటే సీఎన్‌జీ కారు కొంత ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు.. తమ వాహనాలను సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో రూ. 9 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే సీఎన్‌జీ కార్లను గురించి తెలుసుకుందాం.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ సీఎన్‌జీ (Maruti Suzuki Fronx CNG)
మార్కెట్లో లాంచ్ అయిన అతి తక్కువ కాలంలోనే.. కంపెనీ తన ఫ్రాంక్స్ కారును సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేసింది. చూడటానికి సాధారణ కారు మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కనిపిస్తాయి. ఈ కారు ధర రూ. 8.46 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 1197 సీసీ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఇది 28.51 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.
టాటా పంచ్ సీఎన్‌జీ (Tata Punch CNG)
భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటి, ఎక్కువ అమ్ముడైన మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్. ఇది మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ రూపాల్లో అందుబాటులో ఉంది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించిన ఈ టాటా పంచ్ సీఎన్‌జీ 26.99 కిమీ / కేజీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 7.23 లక్షలు (ఎక్స్-షోరూమ్). ధర అనేది ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్ సీఎన్‌జీ (Hyundai Exter S CNG)
రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ సీఎన్‌జీ కార్లలో.. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్ సీఎన్‌జీ కూడా ఉంది. దీని ధర రూ. 8.43 లక్షలు. ఇది 27.1 కిమీ / కేజీ మైలేజ్ అందిస్తుంది. మార్కెట్లో ఈ కారు మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. మైలేజ్ సాధారణ మోడల్ కంటే కొంత ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment