ఐఓసీ లాభం రూ.3,995 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ, ఇండియన్ ఆయిల్ కార్పొ.(ఐఓసీ). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.3,995 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ3లో సాధించిన నికర లాభం(రూ. 3,096 కోట్లు)తో పోల్చితే 29 శాతం వృద్ధి సాధించామని ఐఓసీ తెలిపింది.రిఫైనరీ మార్జిన్లు, ఇన్వెంటరీ లాభాలు అధికంగా ఉండడం వంటి కారణాల వల్ల ఈ స్థాయి నికర లాభం సాధించామని కంపెనీ డైరెక్టర్(ఫైనాన్స్) ఏ.కె. శర్మ చెప్పారు. ఒక్కో షేర్‌కు రూ.13.5 (135 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొన్నారు. తమ కంపెనీలో ప్రభుత్వానికి 58.28 శాతం వాటా ఉండటంతో రూ.3,821 కోట్ల డివిడెండ్ ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుందని తెలిపారు.
7.79 డాలర్లకు జీఆర్‌ఎమ్
ఒక్కో బ్యారెల్ ముడి చమరును ఇంధనంగా మార్చే విషయంలో 7.79 డాలర్ల స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్‌ఎమ్) సాధించామని శర్మ వివరించారు. గత క్యూ3లో జీఆర్‌ఎమ్ 5.96 డాలర్లని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో ఇన్వెంటరీ లాభాలు కూడా పెరిగాయని వివరించారు. గత క్యూ3లో రూ.4,485 కోట్ల ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయని, అయితే ఈ క్యూ3లో మాత్రం రూ.3,050 కోట్ల ఇన్వెంటరీ లాభాలు వచ్చాయని పేర్కొన్నారు. మొత్తం అమ్మకాలు రూ.96,783 కోట్ల నుంచి రూ.1,15,161 కోట్లకు పెరిగాయని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐఓసీ షేర్ 3 శాతం క్షీణించి రూ.366 వద్ద ముగిసింది.