గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ - రష్యా మధ్య దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా చమరు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో, అనేక దేశాలు తమ దేశాలలో ఇంధన ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా శ్రీలంకలోని చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఎల్ఐఓసీ) నేడు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను భారీగా పెంచింది. ఎల్ఐఓసీ సంస్థ ఒక నెలలో ఇంధన ధరలను పెంచడం ఇది మూడవసారి. డీజిల్ రిటైల్ ధరను లీటరుకు రూ.75, పెట్రోల్‌పై లీటరుకు రూ.50 పెంచినట్లు ఎల్ఐఓసీ ప్రకటించింది.
శ్రీలంక రూపాయి మారకం విలువ భారీగా పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా సంస్థ పేర్కొంది. ఈ ధరల పెరుగుదలతో శ్రీలంకలో లీటరు పెట్రోల్ ధర రూ.254, డీజిల్ ధర రూ.214కు లభిస్తుంది. గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభం చిక్కుకోవడంతో ఇంధన ధరలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగాయి. శ్రీలంక రూపాయి ఏడు రోజుల వ్యవధిలో యుఎస్ డాలరుతో పోలిస్తే రూ.57 క్షీణించింది. ఆ ప్రభావం ఇప్పుడు నేరుగా చమురు, గ్యాసోలిన్ ఉత్పత్తుల మీద పడింది. దీంతో ఆ చమురు, గ్యాసోలిన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
"రష్యాను ఏకాకిని చేయడానికి, అమెరికాతో సహ ఇతర పాశ్చాత్య దేశాలు మాస్కో మీద అనేక ఆంక్షలు విధించడం వల్ల చమురు & గ్యాస్ ధరలు పెరుగుదలకు కారణం" అని ఎల్ఐఓసీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గుప్తా తెలిపారు. శ్రీలంక ప్రభుత్వం నుంచి ఎల్ఐఓసీ ఎటువంటి సబ్సిడీని అందుకోదని.. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశంలో ధరలు పెంచాల్సి వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో చమురు, గ్యాస్ ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదు అని మనోజ్ గుప్తా పేర్కొన్నారు. ధరలను భారీగా పెంచిన సంస్థకు నష్టాలు తప్పడం లేదు గుప్తా అన్నారు. ఎల్ఐఓసీకి ప్రధాన పోటీదారుడు సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఇప్పటివరకు ఎలాంటి ధరల పెంపును ప్రకటించకపోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment