రష్యా ప్రాతినిధ్యంపై భిన్న వాదనలు
లాసానే: రష్యాను ఒలింపిక్స్ నుంచి బహిష్కరించాలన్న డిమాండ్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తిరస్కరించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి ప్రభుత్వమే డోపింగ్ చేయించిందని తేలడంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఓ వర్గం వాదిస్తోంది. వాడాతో పాటు అమెరికా, న్యూజిలాండ్ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీలు ఈ విషయంలో ముందున్నాయి. మరోవైపు ఏకపక్షంగా అందరిపై నిషేధం విధిస్తే డోపింగ్‌కు పాల్పడని అథ్లెట్లను కూడా అన్యాయంగా శిక్షించినట్టు అవుతుందని యూరోపియన్ ఒలింపిక్ కమిటీ, జాతీయ ఒలింపిక్ కమిటీ సంఘం (ఏఎన్‌ఓసీ)లు వాదిస్తున్నాయి.
రష్యా అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొనాలా? వద్దా? అనే విషయాన్ని ఆయా క్రీడా సమాఖ్యలకే వదిలేస్తూ ఐఓసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే గేమ్స్‌లో పాల్గొనడానికి ముందు తాము డోపింగ్‌కు పాల్పడలేదని ఆట గాళ్లు తమ క్రీడా సంఘాల నుంచి క్లియరెన్స్ పొందాల్సి ఉంటుంది.